బాటలు బాగా లేవు..

14 Feb, 2019 12:26 IST|Sakshi
 సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌ 

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌లో ప్రజలు నడిచే బాటలు ఏ ఒక్కటి కూడా బాగా లేదు.. ప్రజలకు అత్యంత ప్రధానమైన సదుపాయాలపై దృష్టి సారించండి.. ప్రణాళికలు రూపొందించి అభివృద్ది చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.. అని వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం సమసన్వయ సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి మేయర్‌ ఖాజాసిరాజుద్దీన్, కమిషనర్‌ రవికిరణ్, కార్పొరేటర్లతోపాటు వరంగల్‌ మహానగర పాలక సంస్థ, ‘కుడా’ రైల్వే, ఆర్‌అండ్‌బీ, ఎన్పీడీసీఎల్, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక నిధులు, స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్, జనరల్‌ ఫండ్, సీడీఎఫ్‌ నిధులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, బస్‌ షెల్టర్లు, ఇంటింటా తాగునీటి నల్లాలు, సరఫరా, అండర్‌ బ్రిడ్జి విస్తరణ పనులు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించి సూచనలు చేశారు. కాలనీల్లో అండర్‌ డ్రైయినేజీ లేకుండానే మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల(ఎస్‌టీపీ)ను ఎవరు అడుగుతున్నారని అధికారులను ప్రశ్నించారు.

అండర్‌ బ్రిడ్జి మూడో దారికి డీపీఆర్‌ రూపొందించాలి..
వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి మూడో దారికి డీపీఆర్‌ రూపొందించి.. అందజేయాలని రైల్వే ఇంజినీర్లకు ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం ఉన్న రహదారికి తోడుగా మరో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. హెడ్‌ పోస్టాఫీస్‌ నుంచి ఖమ్మం రోడ్డు మీదుగా వంద ఫీట్ల రహదారి విస్తరిస్తున్నందున మూడో దారి ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

రహదారుల విస్తరణ, అభివృద్ధిపై దృష్టి పెట్టండి..
స్మార్ట్‌సిటీ, సీఎం ప్రత్యేక నిధులతో రూపొందించిన ప్రణాళికలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రూ.257 కోట్లతో 13 రహదారుల ప్రతిపాదనలు, టెండర్ల ప్రక్రియపై ప్రశ్నించారు. ప్రతిపాదనల్లో కొన్ని రహదారులను స్మార్ట్‌సిటీ బోర్డు రద్దు చేసి రూ.130కోట్టతో రెడ్డిపురం, బంధం చెరువు, రంగ సముద్రంలో ఎస్‌టీపీ ప్లాంట్‌కు ప్రవేశపెట్టి ఆమోదించినట్లు లీ అసోసియేట్స్‌ ప్రతినిధి తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఎం నుంచి పోచమ్మమైదాన్, వెంకట్రామ జంక్షన్, లేబర్‌ కాలనీ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్, వెంకట్రామ జంక్షన్‌ నుంచి ఆర్‌టీసీ బస్‌ స్టేషన్‌ మీదుగా హెడ్‌ పోస్టాఫీస్‌ వరకు రహదారులను అభివృద్ధి పర్చాలన్నారు.

హెడ్‌ఫోస్టాఫీ నుంచి ఖమ్మం రోడ్డు మీదుగా నాయుడుపెట్రోల్‌ పంపు వరకు రహదారి ఆక్రమణలను తొలగించి వంద ఫీట్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు. హెడ్‌ఫోస్టాఫీస్‌ నుంచి వరంగల్‌ చౌరస్తా, ఒకవైపు హంటర్‌ రోడ్డు, మరో వైపు పోచమ్మమైదాన్, ఎంజీఎం రోడ్డు నుంచి ఇందిరా గాంధీ బొమ్మ, కొత్తవాడ వంద ïఫీట్ల రోడ్డు, రైల్వే గేట్‌ ఫ్లై ఓవర్‌ నుంచి రంగశాయిపేట, దసరా రోడ్లు, శివనగర్‌ ప్రశాంతి ఆస్పత్రి రోడ్ల అభివృద్ది పనులపై ఆరా తీశారు. కొన్ని రహదారులకు రెండో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఇంజినీర్లు తెలపగా..  తొలి దఫాలో ఈ రహదారులను అభివృద్ధి చేయాలని నన్నపునేని ఆదేశించారు.
 
ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం..
వరంగల్‌ ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌లో వెయ్యి గజాల్లో తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు నరేందర్‌ సూచించారు. ఈ అంశం న్యాయ వివాదంలో ఉందని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వివరించారు. ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ స్థలంపై కోర్టుకు వెళ్లిన వారితో చర్చించామని.. వారు కేసు విత్‌ డ్రా చేసుకునేందుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  600 గజల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించాల్సి ఉంటుందని ఇంజినీర్లు వివరించారు.

ఏప్రిల్‌ నాటికి ఇంటింటికీ తాగునీరు..
అమృత్‌ పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. 33 వాటర్‌ ట్యాంక్‌లకు గాను 30 ట్యాంక్‌లు నిర్మాణంలో ఉన్నాయని, మూడు స్థల వివాదాల్లో ఉండడం వల్ల పనులు ప్రారంభం కాలేదని పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్లు తెలిపారు. బల్దియా, రెవెన్యూ, ‘కుడా’ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 2.10 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రస్తుతం 1.10 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాల్లో ఉన్న ఇళ్లకు ఇంటి నంబర్లు ఇచ్చి నల్లా కనెక్షన్ల ద్వారా ఏప్రిల్‌ నుంచి ఇంటింటా తాగునీరు అందించాలని నరేందర్‌ అదేశించారు. అదేవిధంగా వరంగల్‌ ఆర్‌టీసీ బస్‌ స్టేషన్‌ను మోడల్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.  నగరంలో 163 ఆధునిక బస్‌ షెల్టర్ల నిర్మాణాలపై దృష్టిసారించాలన్నారు. కోమటిపల్లి, ఉర్సు రంగ సముద్రం, చిన్నవడ్డేపల్లి చెరువు అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు.

ఇంజినీర్ల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి..
బల్దియా ఇంజినీర్లు, ఇతర శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతోందని ఎస్‌ఈ బిక్షపతిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇంజినీర్లు సహకరించకపోవడం వల్ల  రహదారుల అభివృద్ధి పనులు జరగడం లేదని ఆర్‌అండ్‌బీ అధికారులు వ్యక్తం చేయడం ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ నాగేశ్వర్, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, సీపీ నర్సింహాచారి, సెక్రటరీ విజయలక్ష్మి, ఎంహెచ్‌ఓ రాజారెడ్డి, తూర్పు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌ రావు, బయ్యస్వామి, కుందారపు రాజేందర్, ఝెలగం లీలావతి, రిజ్వీనా షమీమ్, శారద జోషి, అశ్రిత రెడ్డి, వేణుగోపాల్, కేడల పద్మ, మురహరి భాగ్యలక్ష్మి, కావటి కవిత, మేడిది రజిత, సులోచన ఆర్‌అండ్‌బీ, రైల్వే, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు