‘ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్‌ జారీ

21 Feb, 2019 03:13 IST|Sakshi

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ

ఐదు స్థానాలకు మార్చి 12న పోలింగ్‌

అన్ని స్థానాల్లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమా

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఫిబ్రవరి 28 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మార్చి 5న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మార్చి 12న పోలింగ్‌తోపాటు ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్రంలో పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్యే కోటాలోని ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు స్థానాలనూ గెలుచుకునేలా టీఆర్‌ఎస్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎమ్మెల్యే ఓటింగ్‌ తీరుపై ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. నామినేషన్ల దాఖలు గడువుకు ఒకటిరెండు రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమ్మద్‌ మహమూద్‌అలీ(టీఆర్‌ఎస్‌), మహ్మద్‌ సలీం (టీఆర్‌ఎస్‌), తిరువరంగం సంతోష్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ షబ్బీర్‌అలీ(కాంగ్రెస్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్‌) పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది. ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో 120 మంది సభ్యులు ఉన్నారు. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఒక్కో స్థానానికి 24 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 91, కాంగ్రెస్‌ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ తరఫున అభ్యర్థి బరిలో ఉంటే లెక్కలు మారనున్నాయి. ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉంటే ఎమ్మెల్యేల కేటాయింపు సంఖ్యలో మార్పులు ఉండనున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీలో ఉన్నా అన్ని స్థానాల్లో గెలుపు తమదేనని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. హోంమంత్రి మహమూద్‌అలీ, మహ్మద్‌ సలీం, టి.సంతోష్‌కుమార్‌కు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు.

మహ్మద్‌ షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీ కాలంతో ఖాళీ అవుతున్న రెండు సీట్లతోనే కొత్త వారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. స్వామిగౌడ్‌ ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలోనే తనకు ఈసారి అవకాశం వస్తుందని స్వామిగౌడ్‌ ఆశిస్తున్నారు. స్వామిగౌడ్‌కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురు అభ్యర్థులు ఎవరనే విషయంపై టీఆర్‌ఎస్‌లోని ఆశావహులలో ఉత్కంఠ పెరుగుతోంది.

నోటిఫికేషన్‌ వివరాలు
నోటిఫికేషన్‌ జారీ: ఫిబ్రవరి 21, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, నామినేషన్ల పరిశీలన: మార్చి 1, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 5, ఎన్నికల పోలింగ్‌: మార్చి 12 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు), ఓట్ల లెక్కింపు: మార్చి 12 సాయంత్రం 5 గంటలకు, ఎన్నికల ప్రక్రియ ముగింపు: మార్చి 15

మరిన్ని వార్తలు