‘సీతక్క మీరు చరిత్రలో నిలిచిపోతారు..’

3 May, 2020 18:48 IST|Sakshi

ములుగు : కరోనా కష్టకాలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సాయంపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రోడ్డు మార్గం లేని గిరిజన గ్రామాలకు సైతం వెళ్లి.. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న అక్కడివారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఆహారం కూడా పంపిణీ చేస్తున్నారు. గత 38 రోజులుగా ఆమె పేదలకు సాయం అందిస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘గో హంగర్‌ గో’ చాలెంజ్‌ను ప్రారంభించారు.

తాజాగా 39 వరోజు(ఆదివారం) సీతక్క పొనుగోలు గ్రామంలో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇందుకోసం కొద్ది దూరం బైక్‌పై‌, మరికొంత దూరం సరైన మార్గంలేని రాళ్లు, రప్పల్లో కాలినడకన ప్రయాణించారు. ఇలా 16 కి.మీ ప్రయాణించి ఆ ఊరికి చేరుకున్నారు. రోడ్డు కూడా సరిగా లేని మార్గంలో నిత్యావసరాలు మోసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సీతక్క మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది, మీకు భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం.. అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి : అప్పుడు.. ఇప్పుడు.. ప్రజాసేవకే!

మరిన్ని వార్తలు