‘ఇక ప్రభుత్వంపై ప్రజాయుద్ధమే’

10 Jul, 2017 18:25 IST|Sakshi
‘ఇక ప్రభుత్వంపై ప్రజాయుద్ధమే’

హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించే ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లో నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేసి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి తగ్గట్టుగా నిర్ణయం మార్చుకోవాలని కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగంగా డీ-82లో తొలగించిన 35వేల ఎకరాల ఆయకట్టు పునరుద్దణ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

లేదంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రజల తరపున ఇదే తన అల్టిమేటం అని తెలిపారు. ఈనెల 18వ తేదీన వేలాది మంది రైతులతో ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. 18 తర్వాత ఇక ప్రభుత్వంపై ప్రజా యుద్ధమేనన్నారు. ప్రజలు గెలుస్తారో, పదవులకోసం పాకులాడే నాయకులు గెలుస్తారో తేల్చుకుందామని వ్యాఖ్యానించారు. రైతులు గెలుస్తారో, కాంట్రాక్టర్లతో రాజీపడే రాబందులు గెలుస్తారో తేల్చుకుందామని ప్రభుత్వానికి వంశీచంద్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు