వీడియో అంటే వెనక్కు తగ్గారు

14 Sep, 2019 09:25 IST|Sakshi
రాంగ్‌రూట్‌లో వచ్చిన ఎమ్మెల్యే వాహనం

రాంగ్‌రూట్‌లో వచ్చిన ఎమ్మెల్యే వాహనం అడ్డగింత

బషీర్‌బాగ్‌ చౌరస్తాలో గురువారం రాత్రి  ఘటన

సాక్షి, సిటీబ్యూరో: ఓ పక్క జోరుగా నిమజ్జన వాహన శ్రేణి ముందుకు సాగుతుండగా... గురువారం రాత్రి ఓ ఎమ్మెల్యే వాహనం బషీర్‌బాగ్‌ చౌరస్తాలో హల్‌చల్‌ చేసింది. రాంగ్‌రూట్‌లో వచ్చి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించింది...దీనిని గుర్తించిన డీఎస్పీ స్థాయి అధికారి వెంకట్‌రెడ్డి సదరు వాహనాన్ని అడ్డుకున్నారు. ఎలాంటి వాగ్వాదం, ఘర్షణలకు తావు లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వాహనాన్ని వెనక్కు పంపారు. సామూహిక నిమజ్జనం నేపథ్యంలో గురువారం నగర వ్యాప్తంగా 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరం మధ్య నుంచి శోభాయాత్ర రూట్‌ ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఇవి అమలులో ఉన్నాయి. పశ్చిమ భాగం నుంచి తూర్పు వైపునకు వెళ్లడానికి కేవలం బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ కింద, కనకదుర్గ దేవాలయం వద్ద మాత్రమే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం వరకు వాహనాలను మామూలుగానే వదిలిన పోలీసులు విగ్రహాలతో వస్తున్న లారీల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రూట్‌ను నియంత్రించారు. తాళ్లను ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు అవకాశం చిక్కినప్పుడల్లా విగ్రహాలను తీసుకువచ్చే లారీలను ఆపి సాధారణ ట్రాఫిక్‌ను ఇటు లక్డీకపూల్‌ వైపు, అటు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వైపు పంపుతున్నారు. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి.

ఒక్కో వాహనం బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ దాటడానికి 20 నుంచి 25 నిమిషాలు పట్టింది. ఆ ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్, విగ్రహాలను తీసుకువస్తున్న వాహనాలను నియంత్రించడం ట్రాఫిక్‌ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అదే సమయంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ ఇన్నోవా లక్డీకాపూల్‌ వైపు నుంచి రాంగ్‌రూట్‌లో బషీర్‌బాగ్‌ చౌరస్తా వరకు దూసుకువచ్చింది. అక్కడ నుంచి సరైన మార్గంలోకి మారి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. దీనిని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఈ–చలాన్‌ విభాగం డీఎస్పీ కె.వెంకట్‌రెడ్డి గమనించారు. తక్షణం ఆ వాహనాన్ని అడ్డుకుని వెనక్కు వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే వాహనం నుంచి కిందికి దిగిన గన్‌మెన్‌ లోపల సార్‌ ఉన్నారని, ముందుకు వెళ్ళాల్సి ఉందని చెబుతూ కాస్సేపు అక్కడే కారు ఆపారు. ఇందుకు అంగీకరించని వెంకట్‌రెడ్డి ఏ మాత్రం వాగ్వాదానికి అవకాశం ఇవ్వకుండా తన జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ తీసి  ఎమ్మెల్యే వాహనాన్ని వీడియో తీసేందుకు సిద్ధమయ్యారు. దీని ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గన్‌మెన్‌కు స్పష్టం చేశారు. దీనిని  గమనించిన ఎమ్మెల్యే తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాన్ని వెనక్కు తిప్పుకుని వెళ్లక తప్పలేదు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఆయన   సమయస్ఫూర్తిని అభినందించారు. వెంకట్‌రెడ్డి గతంలో మలక్‌పేట్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గానూ పని చేశారు. 

మరిన్ని వార్తలు