రసవత్తరంగా ఎమ్మెల్సీ పోరు

1 Mar, 2019 03:17 IST|Sakshi

ఆరో అభ్యర్థిగా కాంగ్రెస్‌ నేత గూడూరు నామినేషన్‌

ఇప్పటికే నాలుగు టీఆర్‌ఎస్,ఒక ఎంఐఎం నామినేషన్లు దాఖలు

ఆసక్తికరంగా మారిన ఎమ్మెల్యే కోటా మండలి అభ్యర్థుల ఎన్నిక

సాక్షి, హైదరాబాద్‌: ఊహించినట్టుగానే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలను మండలికి పంపే ఈ ఎన్నికలో.. అధికార టీఆర్‌ఎస్‌ పక్షం ఐదుగురు అభ్యర్థులను పోటీలో నిలపగా (ఎంఐఎంతో కలిపి), కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులను కలుపుకుంటే గెలిచే బలం ఉన్న కాంగ్రెస్‌ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. లెక్కల ప్రకారం చూస్తే టీఆర్‌ఎస్‌ పక్షం 4, కాంగ్రెస్‌ ఒకటి (టీడీపీ మద్దతిస్తే) గెలిచే అవకాశాలుండగా, అధికార పక్షం ఐదో అభ్యర్థిని బరిలోకి దించడంతో రాజకీయంగా రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

మూడింటిలో ఏది జరిగినా?
ప్రస్తుతం శాసనసభకు ఎంపికైన 119 మంది ఎమ్మెల్యేలు, నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిస్తే 120 మందికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కుంటుంది. పార్టీల వారీగా బలాబలాలను చూస్తే టీఆర్‌ఎస్‌కు 88 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక నామినేటెడ్‌ సభ్యుడు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు కలిపి అధికార టీఆర్‌ఎస్‌ పక్షాన 98 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 19 మంది, టీడీపీకి ఇద్దరు, బీజేపీకి ఒక సభ్యుడున్నారు. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 20 ఓట్లు అవసరం. కాంగ్రెస్‌ 19 మందితో పాటు టీడీపీ నుంచి ఒకరు లేదా ఇద్దరు ఓట్లేస్తే కాంగ్రెస్‌ అభ్యర్థి గూడూ రు నారాయణరెడ్డి సునాయాసంగా విజయం సాధిస్తారు. కానీ, ఐదుగురు అభ్యర్థులను బరిలో దింపిన అధికార పక్షం ఇంత సునాయాసంగా కాంగ్రెస్‌కు ఓ ఎమ్మెల్సీ సీటును ఇస్తుందా అన్నదే చర్చనీయాం శంమైంది. టీఆర్‌ఎస్‌ పక్షాన బరిలో ఉన్న ఐదుగురిలో నలుగురు అభ్యర్థులకు 20 చొప్పున ఓట్లు పడితే ఐదో అభ్యర్థికి 18 ఓట్లు మాత్రమే మిగులుతాయి. అంటే మరో 2 ఓట్లు వస్తే కానీ ఆ అభ్యర్థి గెలవడం సాధ్యం కాదు.

రెండు ప్లాన్‌లతో పద్మవ్యూహం
దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్‌ ప్లాన్‌–ఏ, ప్లాన్‌–బీలను తయారు చేసుకుంటోంది. ప్లాన్‌–ఏలో నలుగురు అభ్యర్థులకు 20 ఓట్లు చొప్పున వేయించి, ఐదో అభ్యర్థికి అదనంగా అవసరమయ్యే 2 ఓట్లను కాంగ్రెస్‌ లేదా టీడీపీల నుంచి పొందాలనే ప్రణాళికలో ఉంది. ఇతర పార్టీల నుంచి ఓట్లు తెచ్చుకున్నామనే పేరు రాకుండా ప్లాన్‌–బీ గురించి కూడా కేసీఆర్‌ యోచిస్తున్నారు. ప్లాన్‌–బీలో భాగంగా అధికార పక్షం నుంచి బరిలో ఉన్న ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి మాత్ర మే నేరుగా గెలుపునకు అవసరమయ్యే 20 ఓట్లు వేయిస్తారు.

మిగిలిన ఇద్దరికీ 19 ఓట్లు చొప్పున వేయిస్తారు. ఒకవేళ కాంగ్రెస్‌ నుంచి రావాల్సిన 21 ఓట్లలో 2 ఓట్లు రాకపోయినా (సభ్యులు గైర్హాజరయి నా), రెండు ఓట్లు చెల్లకపోయినా కాంగ్రెస్‌ అభ్యర్థికి కూడా 19 ఓట్లు మాత్రమే వస్తాయి. అప్పుడు అనివార్యంగా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తే అధికార పక్షం నుంచి ఉన్న ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడం సులభం. ఈ 2 ప్లాన్‌లలో దేన్ని ఎంచుకుంటారు? నేరుగా ఇతర పార్టీల ఓట్లు తెచ్చుకుంటారా? లేక ప్లాన్‌–బీలో భాగంగా సాంకేతికంగా విజయం సాధించేలా ప్రణాళిక రూపొందిస్తారా? అసలు సీఎం కేసీఆర్‌ మదిలో ఏముంది?ఆయన ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది ఇప్పుడు అన్ని వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

అంతా సజావుగా సాగితేనే!
ఇక 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ సభ్యులు పొల్లుపోకుండా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేస్తేనే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ గెలుపు సాధ్యమవుతుంది. దీనికో సం కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు జారిపోకుండా ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించాలని భావిస్తోంది. టీడీపీ మద్దతు కోసం ఢిల్లీ పెద్దల ద్వారా చంద్రబాబు సహకారం తీసుకో వాలని నిర్ణయించింది. ఈ విషయంపై టీపీసీసీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ ‘అధికార పక్షం ఐదుగురు అభ్యర్థులను నిలబెట్టినా మా సభ్యులపై ఉన్న నమ్మకంతోనే పోటీకి దిగాం. బరిలో నిలిచాక ఏ రాజకీయ పార్టీ కూడా ఓటమిని అంగీకరించదు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. ఇప్పుడు మేం కూడా గెలవబోతున్నాం. మా సభ్యులపై మాకు ఆ నమ్మకం ఉంది. అందరూ మాతో టచ్‌లోనే ఉన్నారు. అందరితో మాట్లాడిన తర్వాతే ఎమ్మెల్సీ బరిలో ఉండాలని నిర్ణయించాం. ఒకవేళ జరగరానిది జరిగినా.. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు ఈ ఎన్నికలతో తేలిపోతాయి’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ముగ్గురు గైర్హాజరయితేనే..
ఈ ఎన్నికల్లో అధికార పక్షం గెలవాలంటే క్రాస్‌ ఓటింగ్‌ అయినా జరగాలి లేదంటే ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావాలి. లేదా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి పడే మూడు ఓట్లు చెల్లకుండా పోవాలి. ఈ మూడింటిలో ఏది జరిగినా ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో అధికార పక్షం సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజాసింగ్‌ గైర్హాజరీకి మాత్రమే అవకాశం ఉంది. ఆయన ఓటు వేయకుండా, టీడీపీకి చెందిన ఇద్దరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నా టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమే. అలా కాకుండా ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేసి, టీడీపీకి చెందిన ఇద్దరు గైర్హాజరయినా కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు వచ్చిన ఇబ్బందేం ఉండదు. అప్పుడు కాంగ్రెస్‌కు చెందిన 19 మంది సభ్యులు తమ పార్టీ అభ్యర్థికి చెల్లిన ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అందరు సభ్యులు హాజరయి కాంగ్రెస్‌ అభ్యర్థికి పడాల్సిన ఓట్లలో రెండు లేదా మూడు ఓట్లు చెల్లకపోయినా ద్వితీయ ప్రాధాన్యత ఓటు ద్వారా టీఆర్‌ఎస్‌ పక్ష అభ్యర్థులంతా విజయం సాధిస్తారు.

ఓటు విలువ నిర్ధారిస్తారిలా..
ఎమ్మెల్యే కోటాలో ఈ దఫా ఐదుగురు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చింది. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 120. అంటే 120 ఓట్లున్నాయి. ఎమ్మెల్యే కోటాలో వేసే ప్రతి ఓటు 100తో సమానం. 120 ఓట్లు 12,000తో సమానం. దీనిని మొత్తం ఖాళీలకు (5) అదనంగా మరొకటి కలిపి 6తో భాగి స్తారు. అలా చేస్తే 2,000 వస్తుంది. దీనికి 1 కలుపుతారు. అప్పుడు 2,001 అవుతుంది. దీన్ని డెసిమల్స్‌లో లెక్కిస్తే 20.01 అవుతుంది. అది 20తో సమానం. అంటే ఒక్క ఎమ్మెల్సీ గెలవడానికి 20 ఓట్లు రావాలన్న మాట.

సభ్యులు గైర్హాజరైతే!
120 మంది ఓట్లు వేస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 20 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. ఒక సభ్యుడు గైర్హాజరు అయితే అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 అవుతుంది. దీన్ని 100తో హెచ్చించి ఆరుతో భాగిస్తే 1983 అవుతుంది. దానికి ఒకటి కలిపితే 1984. దాన్ని డెసిమల్స్‌లో తీసుకుంటే 19.84 అవుతుంది. ఇది 20తో సమానమే. అంటే అప్పుడు కూడా 20 ఓట్లు కావాలి. ఇలా ఎంత మంది సభ్యులు గైర్హాజరు అయితే ఒక్కో అభ్యర్థి గెలవడానికి కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్ల సంఖ్య అంత తగ్గిపోతుంది.

రెండో ప్రాధాన్యతకు వెళ్తే..
మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవకుండా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తే.. అప్పుడు ఒక్కో ఓటు విలువ 100తో సమానం కాదు. 100లో కొంత భాగం కింద తీసుకుని వాటిని లెక్కిస్తారు. ఇక మూడో ప్రాధాన్యతకు వెళ్లాల్సి వస్తే కనుక ఆ భాగం మరింతగా తగ్గిపోతూ వస్తుంది. అలా ప్రాధాన్యత సంఖ్య పెరిగిన కొద్దీ ఎమ్మెల్యేల ఓటు విలువ 100లో కొంత భాగం తగ్గిపోతూ ఉంటుంది.

చెల్లకుండా పోతాయిలా..
ఓటు వేసే విషయంలో కూడా సభ్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తాము ఏ ప్రాధాన్యత కింద ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నామో ఆ నంబర్‌ను మాత్రమే ఆ అభ్యర్థి పేరుకు ఎదురుగా వేయాల్సి ఉంటుంది. టిక్‌ పెట్టకూడదు. రోమన్‌ నంబర్లు వేయకూడదు. ఈ రెండింటిలో ఏది జరిగినా ఓటు చెల్లకుండా పోతుంది. అప్పుడు గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. 
 

మరిన్ని వార్తలు