టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీకి పోటాపోటీ

19 Feb, 2019 03:47 IST|Sakshi

అధికార పార్టీలోభారీగా ఆశావహులు

మహమూద్‌ అలీ,సలీంకు గ్యారంటీ

మిగిలిన మూడు సీట్లపైనేకొత్త వారి ఆశలు

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో అధికార పార్టీలో ఎమ్మెల్సీ పదవుల పంపకంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్‌ అలీ (టీఆర్‌ఎస్‌), మహమ్మ ద్‌ సలీం (టీఆర్‌ఎస్‌), తిరువరంగరం సంతోష్‌ కుమార్‌ (టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ (కాంగ్రెస్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రె స్‌) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. మార్చి 12న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. నామినే షన్ల దాఖలు ప్రక్రియ ముగిసే ఫిబ్రవరి 28 లోపే అభ్యర్థులను ఖరారు చేయాలి. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో 120 మంది సభ్యులు ఉన్నారు.

5 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో ఒక్కో స్థానానికి 24 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అసెంబ్లీలో ప్రస్తుత బలాల ప్రకారం అన్ని స్థానాలూ టీఆర్‌ఎస్‌కే వచ్చే అవకాశముంది. టీఆర్‌ఎస్‌కు 90, కాంగ్రె స్‌ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసినా ఒక్క స్థానాన్ని గెలుచుకోలేదు. దీంతో ఎన్నికలు జరగనున్న 5 స్థానాలను టీఆర్‌ఎస్‌  గెలుచుకో నుంది. హోంమంత్రి మహమూద్‌ అలీకి మరోసారి అవకాశం అనివార్యం కానుంది. ఇతర పార్టీల్లో ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్‌ఎస్‌లో చేరిన అందరికీ సీఎం కేసీఆర్‌ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇదే ప్రాతిపదికన మహమ్మద్‌ సలీంకు కూడా ఈసారీ అవకాశం దక్కనుంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సంతోష్‌ కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

వాటిపైనే ఆశలు..
షబ్బీర్‌ అలీ, పొంగులేటి సీట్లపైనే టీఆర్‌ఎస్‌లోని ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. పట్టభద్రుల నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసేందుకు స్వామిగౌడ్‌ సుముఖంగా లేరు. ఎమ్మెల్యే కోటా లో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, సత్యవతిరాథోడ్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను ఈ స్థానాల కోసం పరిశీలిస్తున్నారు.

త్వరలో మరో రెండింటికి..
అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానంలో విజయం సాధించిన మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీ నామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యాదవరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన షెడ్యూల్‌లో ఈ స్థానాలను పేర్కొనలేదు. త్వరలో ఈ రెండు స్థానాలకు మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 

మరిన్ని వార్తలు