ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్..!

20 May, 2015 03:33 IST|Sakshi
ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్..!

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్, టీడీపీ నేతల్లో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి సభ్యుల ఎన్నికల నామినేషన్లకు మరొక రోజు మాత్రమే గడువుండగా.. రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 7న విడుదలైన సంగతి విదితమే. 14న ఎన్నికల సం ఘం నోటిఫికేషన్ విడుదల చే యగా.. గురువారంతో నామినేషన్ల ఘట్టం, జూన్ 1న ఎన్నికల ప్రక్రియ ముగియనున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, ఇటీవలే శాసనమండలి ఫ్లోర్ లీడర్‌గా పదవీ విరమణ చేసిన ధర్మపురి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత  పోటీ పడుతుండగా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంపైనే ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ నుంచి నలుగురైదుగురు నేతలు క్యూ కట్టినా.. జిల్లాకు ఈ సారి అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.
 
షెడ్యూల్ విడుదల నుంచే ఉత్కంఠ.. నేటి సాయంత్రం వరకు సస్పెన్సే...
రాష్ట్రపతి ప్రకటనతో 20 రోజుల క్రితం తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలపై స్పష్టత రాగా.. ఈ నెల 7 నుంచి ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. 14న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, ఆశావహులంతా అధినేతల వద్ద లాబీయింగ్ ఉధృతం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఢిల్లీలో అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నారు. హైకమాండ్ వద్ద మంచి పట్టున్న సీనియర్ నేత డి.శ్రీనివాస్ మళ్లీ తనకే వస్తుందన్న ధీమాతో ఉండగా.. ఆకుల లలిత సైతం మహిళా నేతగా తనకు ఎమ్మెల్సీ ఖాయమని చెప్పుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా వుండగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆ పార్టీ నుంచి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. 1983 నుంచి పార్టీలో కొనసాగుతూ మండల కన్వీనర్ నుంచి శాసన మండలి ఫ్లోర్ లీడర్ వరకు ఎదిగిన ఆయన.. టీఆర్‌ఎస్ గాలం వేసినా పార్టీ వీడలేదు. ఇదే అరికెలకు అనుకూల అంశం కాగా, పార్టీ సీనియర్లు సైతం నర్సారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు.

ఢిల్లీ పర్యటన ముగించుకొని బుధవారం హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు అభ్యర్థి పేరు ప్రకటిస్తే ఆ పార్టీలో సస్పెన్స్‌కు తెరపడనుంది. కాంగ్రెస్, టీడీపీలు బుధవారం సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనుండగా.. అప్పటి దాకా ఆశావహులకు ఉత్కంఠ తప్పదన్న చర్చ జరుగుతోంది.
 
టీఆర్‌ఎస్‌కు నో చాన్స్..?
రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో జిల్లాకు ఎమ్మెల్యేల కోటా కింద టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ దక్కుతుందని పలువురు నేతలు భావించారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జిల్లాకు చోటు ఉండదని టీఆర్‌ఎస్ అధిష్టానం స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆరింటిలో నాలుగు స్థానాలకే పార్టీ పోటీచేసే అవకాశం ఉన్నందున జిల్లాకు చాన్స్ దక్కదన్న సంకేతాలను పార్టీ నేతలకు ఇచ్చినట్లు చెప్తున్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని అధినేత కేసీఆర్ ఎన్నికల ముందు పలువురికి హామీ ఇచ్చిన సంగతి విదితమే. నిజామాబాద్ రూరల్ టికెట్ బాజిరెడ్డి గోవర్దన్‌కు కేటాయించిన సందర్భంగా అక్కడ టికెట్ ఆశించిన డాక్టర్ భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్‌కు కూడ ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడిగా ఉన్న ఎస్‌ఏ అలీం తమ వర్గం కోటా కింద ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. అరుుతే అసలు ఈ ఎన్నికల్లో జిల్లాకు అవకాశం లేదనే సంకేతాలు రావడం టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు