ప్రచారం షురూ.. 

22 Feb, 2019 07:25 IST|Sakshi
పీఆర్‌టీయూ తరఫున బరిలో ఉన్న పూల రవీందర్‌ ప్రచారం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: బరిలో నిలిచే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల పోరు షురువైంది. ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కాకముందే ప్రచారం ముమ్మరం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాను ప్రకటించింది. నెలాఖరులోగానీ.. వచ్చే నెల మొదటి వారంలోగానీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తుండగా.. జిల్లాలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది.  ఉపాధ్యాయ సంఘాల్లో దీనిపై సందడి నెలకొంది. పీఆర్‌టీయూ, యూటీఎఫ్, ఎస్‌టీయూలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి బరిలో నిలవనున్నారు.

ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో కలిపి 20,585 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 13,478 మంది ఉండగా.. 7,107 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరికోసం నియోజకవర్గవ్యాప్తంగా 181 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాకపోయినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంఘాలు అభ్యర్థులను కూడా ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

బరిలో నిలిచేందుకు ప్రయత్నం 
ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్‌ పీఆర్‌టీయూ తరఫున మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అదే సంఘం నుంచి అనేక మంది ఈసారి ఎమ్మెల్సీ పదవికీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ యూనియన్‌లోనే భారీ పోటీ నెలకొంది. ఇక యూటీఎఫ్‌ తరఫున అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఆయనకు ఎస్‌టీఎఫ్, టీపీటీఎఫ్‌ మద్దతిస్తున్నాయి. ఎస్‌టీయూ తరఫున వరంగల్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌ బరిలో ఉంటున్నారు. అలాగే రిటైర్డ్‌ డీఈఓ చంద్రమోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ప్రచారం ముమ్మరం 
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు ముందుగానే సిద్ధమవుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్‌ జారీ కాకముందే ప్రచారం కూడా ప్రారంభించాయి. సంఘాల తరఫున పూర్తిస్థాయిలో టికెట్‌ ఖరారు కాకపోయినప్పటికీ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులను కలుస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పీఆర్‌టీయూతోపాటు యూటీఎఫ్, ఎస్‌టీయూ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత అభ్యర్థులు ప్రచార జోరు మరింత పెంచే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు