‘దయ్యాలు వేదాలు వల్లించడమే... ’

4 Apr, 2017 18:17 IST|Sakshi
‘దయ్యాలు వేదాలు వల్లించడమే... ’
హైదరాబాద్‌: ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తాండూర్లో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. భూదందాలు ,అత్యధిక అరాచకాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సంపత్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. తెలంగాణ అభివృద్ధి అడ్డుకోవడమే కాంగ్రెస్ అజెండా అని చెప్పారు.

పాలమూర్లో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతుంటే రంగారెడ్డి లో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు కావాలంటూ పాదయాత్రలు చేస్తున్నారు . ఇదేం ద్వంద్వ నీతి అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మీ ఏలుబడిలో దివాళా తీయించారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించేది కేంద్రమే అనే సంగతి కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ ,పొన్నాల వంటి వారికి ఈ విషయాలు తెలిసే ధర్నాలు చేస్తున్నారా అని సూటిగా అడిగారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరపతి  కోల్పోయిందని, త్వరలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమన్నారు.

అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానమేమిటో ప్రజలు రుచి చూపించారని అన్నారు. కాంగ్రెస్ లోని అజ్ఞానులు చిల్లర మల్లర ఆరోపణలు చేస్తే పట్టించుకోమని తెలిపారు. సంపత్ ఇక నైనా కేటీఆర్‌పై ఆరోపణలు మానుకో .. లేకుంటే ప్రజలే నీకు బుద్ది చెబుతారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు తమ ఆరోపణలు నిరూపించక పోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కేటీఆర్‌ను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని అన్నారు.
 
మరిన్ని వార్తలు