ఊగిసలాట!

26 Oct, 2018 16:05 IST|Sakshi
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

కసిరెడ్డి దారెటు..

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గులాబీ టికెట్‌ రాకపోవడంతో నిరాశకు గురైన కసిరెడ్డి.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించడంపై ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌ టికెట్‌ ఆశించిన ఆయనకు అధిష్టానం మొండిచేయి చూపింది. 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అభ్యర్థిత్వానికే పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ వర్గీయులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అనుచరుల ఒత్తిడికి తలొగ్గిన కసిరెడ్డి కూడా ఎన్నికల ప్రచారానికి ముఖం చాటేశారు. మరోవైపు టికెట్‌ ఇవ్వకుండా అవమానించినందున స్వతంత్రంగా బరిలో దిగాల్సిందేనని మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. తాజా పరిణామాలపై సన్నిహితులతో మంతనాలు జరిపిన ఆయన వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మాడ్గుల మండలం కొల్కుల్‌పల్లిలో ముఖ్యనేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అంశంపై సంకేతాలిచ్చారు. అయితే, టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం బుజ్జగింపులతో వెనక్కి తగ్గారని పోటీ చేయకపోవచ్చనే ప్రచారమూ జరుగుతోంది.   – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కసిరెడ్డి పోటీచేసి ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. తృతీయ స్థానానికి పరిమితమైనా గణనీయంగా ఓట్లను సాధించారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్గీయులంతా అండగా నిలబడడంతో గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో గులాబీ గూటికి చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొంది మండలిలోకి అడుగుపెట్టారు. కల్వకుర్తి నియోజకవర్గానికి విపక్ష ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీయే అన్నీతానై వ్యవహరించారు. ఇబ్బడిముబ్బడిగా నిధులు తీసుకురావడమే గాకుండా పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ ప్రత్యేక ముద్ర వేశారు.

ఈ క్రమంలోనే టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా ఈ సీటును మళ్లీ జైపాల్‌యాదవ్‌కే కట్టబెట్టడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. జైపాల్‌ను వ్యతిరేకించిన ఇతర నేతలంతా మెత్తబడ్డా.. ఎమ్మెల్సీ మాత్రం వెనక్కితగ్గలేదు. మంత్రి కేటీఆర్‌ అసమ్మతివాదులందరితో నిర్వహించిన సమావేశంలోనూ ఆయన బయటపడలేదు. ఆ తర్వాత అనుచరుల ఒత్తిడితో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జైపాల్‌ను వ్యతిరేకించి మద్దతుగా నిలిచామని, ఒకవేళ మీరు గనుక ఆయనకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటే మా దారి మేం చూసుకుంటామని తెగేసి చెప్పారు. దీంతో డైలామాలో పడ్డ కసిరెడ్డి.. కష్టకాలంలో వెన్నంటి నిలిచిన సన్నిహితులను కాపాడుకోవడంపైనే దృష్టిసారించినట్లు తెలిసింది. దీంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు సంకేతాలిచ్చారు.  

నోటిఫికేషన్‌ అనంతరమే..?
రణక్షేత్రంలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరమే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని భావిస్తున్నట్లు సన్నిహితవర్గాలు అంటున్నాయి. నవంబర్‌ 1న కల్వకుర్తిలో జరిగే ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ హాజరవుతున్నందున ఈ సమావేశం అనంతరం కసిరెడ్డి భవిష్యత్తుపై కూడా స్పష్టత వస్తుందని గులాబీ వర్గాలు చెపుతున్నాయి.

మరిన్ని వార్తలు