‘ఎమ్మెల్సీ’ నామినేషన్ల పరిశీలన పూర్తి

23 May, 2015 03:03 IST|Sakshi

హైదరాబాద్: శాసన మండలికి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ముగిసింది. 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ కార్యదర్శి రాజ సదారాం శుక్రవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు.

అందరి నామినేషన్ పత్రాలు సక్రమంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో టీఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఆకుల లలిత, టీడీపీ నుంచి నరేందర్‌రెడ్డి అభ్యర్థులుగా బరిలో ఉన్నారని రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
 
టీఆర్‌ఎస్.. టీడీపీ మధ్య వాదులాట !
నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీఆర్‌ఎస్, టీడీపీ నాయకుల మధ్య వాదులాట జరిగింది. టీడీపీ నేతలు పలు అభ్యంతరాలు వ్యక్తం చే శారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న వేం నరేందర్‌రెడ్డి లిఖిత పూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం విషయంలో సుప్రీం కోర్టులో తుది తీర్పు పెండింగ్‌లో ఉందని, ఆయనకు ఓటు హక్కు లేకున్నా, ఓటరు జాబితాలో ఎలా నమోదు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే గవర్నర్ నామినే ట్ చేసిన ఆంగ్లో ఇండియన్ సభ్యునికి కూడా ఓటు హక్కు ఉండదని, కానీ, ఓటరుగా గుర్తించారని తప్పు బట్టారు. ఈ అంశాలపై టీడీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదుచేసిన సమయంలో అక్కడే ఉన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పాటూరి సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో టీడీపీ నాయకులకు, ఆయనకు మధ్య కొద్దిసేపు వాదులాట జరిగింది. గత మండలి ఎన్నికల్లో వారిద్దరూ ఓట్లు వేసినందునే ఓటు హక్కు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు