రేపే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్!

13 May, 2015 22:29 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఆరు ఎమ్మెల్సీ పదవుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు ఎమ్మెల్యే కోటాలో 14 ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించారు. అయితే, విభజన సమయంలో ఒక స్థానం అధికంగా రావడంతో గత నెల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక స్థానాన్ని తగ్గించాలని సూచించింది. దీంతో గత నెల 29వ తేదీన ఏడు స్థానాలు ఖాళీ అయినా, ఆరు స్థానాలుగానే పరిగణించి నోటిఫికేషన్ విడుదల చే యనున్నారు.

కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన కె.ఆర్.ఆమోస్ ఖాళీ చేసిన స్థానాన్ని తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగానే ప్రకటించారు. ఆయనతో పాటు మార్చి 29వ తేదీన పదవీ విరమణ చేసిన నాగపురి రాజలింగం, పీర్ షబ్బీర్ అహ్మద్, బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి, డి.శ్రీనివాస్‌ల స్థానాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేష్ జారీ అయిన రోజు నుంచే (14వ తేదీ / గురువారం) నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువుగా నిర్ణయించారు. జూన్ 1వ తేదీన రాష్ట్ర శాసన మండలి సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగుతుంది. అదే రోజు సాయంత్ర అయిదు గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

మరిన్ని వార్తలు