ఎమ్మెల్సీ  యాదవరెడ్డిపై వేటు

17 Jan, 2019 12:07 IST|Sakshi
కొంపల్లి యాదవరెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఊహించినట్టుగానే శాసనమండలి సభ్యుడు కొంపల్లి యాదవరెడ్డిపై అనర్హత వేటు పడింది. టీఆర్‌ఎస్‌ సభ్యుడిగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరి.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని ఇటీవల ఆ పార్టీ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న చైర్మన్‌ బుధవారం యాదవరెడ్డిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన యాదవరెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు ఆయన టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి సొంతగూటికి చేరారు. అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్‌ను వదిలిన ఆయన అదే పరిణామాల మధ్య నేడు టీఆర్‌ఎస్‌ను వీడాల్సివచ్చింది. 2014లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఆయన వికారాబాద్‌ జిల్లా నవాబుపేట జెడ్పీటీసీగా గెలుపొందారు. జెడ్పీచైర్మన్‌గా ఆయన పేరు కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది.

దీనికి తగ్గట్టుగా జిల్లా పరిషత్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అనువైన సంఖ్యా బలాన్ని కూడా ఆ పార్టీ సమకూర్చుకుంది. అయితే, ఊహించని రీతిలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆయనను మరో ఇద్దరు సభ్యులు అనుసరించడంతో మేజిక్‌ ఫిగర్‌ ఉన్నప్పటికీ జెడ్పీ చైర్మన్‌ పదవి అందకుండా పోయింది. కష్టకాలంలో పార్టీకి మద్దతు పలికిన యాదవరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ద్వారా గులాబీ దళపతి కేసీఆర్‌ సముచిత స్థానం కల్పించారు. పదవీకాలం ముగిసిన అనంతరం మరోసారి గవర్నర్‌ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా చేశారు. 

కొండాకు అండ!

కొన్నాళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల వేళ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గులాబీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అమరవీరుల ఆశయాల సాధనలో ప్రభుత్వం విఫలమైందని ధిక్కారస్వరం వినిపించారు. అక్రమార్కులకు పట్టం కడుతూ..తెలంగాణ కోసం పోరాడినవారిని విస్మరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాదవరెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రచారాన్ని ఖండిçస్తూనే వస్తున్నా.. టీఆర్‌ఎస్‌ నాయకత్వం యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

అదేరోజు సాయంత్రం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగసభలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నేతృత్వంలో సొంతగూటికి చేరారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆఖండ విజయం సాధించడంతో యాదవరెడ్డి ఎమ్మెల్సీ పదవి ప్రశ్నార్థకంగా మారింది. యాదవరెడ్డితోపాటు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన మరికొందరు సభ్యులపై వేటు వేయాలని టీఆర్‌ఎస్‌ శాసనమండలి పక్షం ఫిర్యాదు చేయడమేగాకుండా.. ఆధారాలు కూడా సమర్పించడంతో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ యాదవరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు