యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైట్‌ రైట్‌!

27 Jun, 2018 02:02 IST|Sakshi

     ఘట్‌కేసర్‌–రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపు

     రూ.150 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌–రాయగిరి (యాదాద్రి) మార్గంలో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (ఎంఎంటీఎస్‌) రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, యాదగిరి గుట్ట ఆలయాభివృద్ధి పనుల్లో భాగంగా ఘట్‌కేసర్‌–రాయగిరి మార్గంలో సైతం ఎంఎంటీఎస్‌ రైలు సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌ రెండో దశ కింద చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద రూ.150 కోట్ల నిధులను హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌ఎల్‌)కు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ మంగళవారం పరిపాలనా అనుమతులు జారీ చేశారు.

ఎంఎంటీఎస్‌ రెండో దశ కింద ఘట్‌కేసర్‌–రాయగిరి మార్గంలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి రూ.75 కోట్లు, జంట నగరాల్లో నిర్మిస్తున్న ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుల కోసం మరో రూ.50 కోట్లు, ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుల భవిష్యత్తు అవసరాలకు రూ.25 కోట్లను హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు కేటాయిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (ఎంఎంఎస్‌ఆర్టీఎస్‌) ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.350 కోట్లను విడుదల చేయాలని రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కోరడంతో, ప్రస్తుతానికి రూ.150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.  

మెట్రో అనుసంధానంపై పరిశీలన     
హైదరాబాద్‌ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లను అనుసంధానం చేసి ప్రయాణికులకు చివరి మైలు వరకు కనెక్టివిటీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెట్రో రైలు స్టేషన్లను, ఎంఎంటీఎస్‌ స్టేషన్లు, బస్‌ స్టాపులతో అనుసంధానం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఈ బాధ్యతలను హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్‌ రెండో దశకు సంబంధించిన నిధులను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సంస్థకు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.    

మరిన్ని వార్తలు