అరచేతిలో ఉద్యోగం!

27 Aug, 2019 03:21 IST|Sakshi

డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్చేంజ్‌

‘ప్రైవేటు’ ఉద్యోగావకాశాలకు మొబైల్‌ యాప్, వెబ్‌సైట్‌ 

అందుబాటులోకి తెచ్చిన కార్మికశాఖ 

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. కొలువుల చిట్టా ప్రత్యక్షం

సాక్షి, హైదరాబాద్‌ : ఇకపై ఉద్యోగ ప్రయత్నం మరింత సులభతరం కానుంది. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్‌ యాప్, వెబ్‌పేజీ తెరిచింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులు ఈ యాప్‌ లేదా వెబ్‌పేజీలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు.. వారి అర్హతకు తగ్గ ఉద్యోగాల జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇంతకుముందు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ... అవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఉద్యోగం వచ్చిన తర్వాత.. లేదా ఉద్యోగాల జాబితా ప్రచురణకు వెబ్‌సైట్‌ నిర్వహణ సంస్థకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. తాజాగా కార్మిక ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీట్‌) యాప్‌ మాత్రం పూర్తిగా ఉచితం. కంపెనీలల్లో ఖాళీల నమోదుకు ఎలాంటి చెల్లింపులుండవు. ఉద్యోగ ప్రయత్నం చేసే అభ్యర్థికి సైతం పూర్తిగా ఉచిత సేవలందిస్తారు.     

గుర్తింపు ఉన్న కంపెనీల్లోనే.. 
డీట్‌ యాప్, వెబ్‌పేజీల్లో గుర్తింపు ఉన్న కంపెనీల్లో ఖాళీల ప్రదర్శనకు కచ్చితమైన నిబంధనలు పాటిస్తుంది. ఉద్యోగ ఖాళీలున్నట్లు వచ్చే నోటిఫికేషన్ల తాలూకు కంపెనీ పూర్వాపరాలు ముందుగా యాప్‌ నిర్వాహకులు పరిశీలిస్తారు. మొబైల్‌ ఫోన్‌ వెరిఫికేషన్, ఈ–మెయిల్‌ వెరిఫికేషన్‌ చేసిన తర్వాత క్షేత్ర పరిశీలన చేసి నిర్ధారిస్తారు. అలా మూడు దశల్లో ఆమోదం పొందిన తర్వాతే సదరు నోటిఫికేషన్లను యాప్, వెబ్‌పేజీల్లో ప్రదర్శిస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిర్వహించే కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు రంగ కంపెనీలైనా.. సంబంధిత శాఖల సలహాలు, సూచనలు సైతం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా.. 
గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో డీట్‌ (deet)  అని టైప్‌ చేసి సెర్చ్‌ చేస్తే డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ తెలంగాణ పేరుతో యాప్‌ ప్రత్యక్షమవుతుంది. ఇన్‌స్టాల్‌ చేసుకుని.. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత అవకాశాలను బట్టి ఉద్యోగం ఇచ్చే కంపెనీతో చాట్‌ చేసే వీలుంటుంది. ఆ కంపెనీ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వివరాలు తెలుసుకుని ఉద్యోగ పరిస్థితి, ఇంటర్వూ్య తదితర ప్రక్రియల కోసం ముందుకెళ్లొచ్చు. అలాగే  https://tsdeet.com వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఉద్యోగాల శోధన చేయొచ్చు. 

డీట్‌ యాప్, వెబ్‌పేజీలను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి 
డీట్‌ యాప్, డీట్‌ వెబ్‌పేజీలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ యాప్‌ ద్వారా ఉచితంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాప్, వెబ్‌పేజీ నిర్వహణ కోసం ఏటా రూ.10 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, కార్మిక ఉపాధి కల్పన డైరెక్టర్‌ కేవై నాయక్, మోహిత్‌కుమార్‌ పాల్గొన్నారు.  

ఓకే చోట పరిశీలన 
ఉద్యోగావకాశాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుంది. అక్కడ ఉద్యోగాలున్నా అవి అభ్యర్థి అర్హతలకు సరిపోతాయో లేదోనన్న సందేహం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే కంపెనీలు వెబ్‌పేజీల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఆయా కంపెనీల పేజీలను ఒక్కొక్కటిగా వీక్షించడంతో సమయం ఎక్కువ పడుతుంది. వీటిన్నింటిని అధిగమించి సులభంగా ఒకే వేదికగా ఉద్యోగాలను చూసుకునే వీలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈ యాప్‌/వెబ్‌పేజీలు ప్రారంభదశలో ఉన్నాయి. ఇప్పటికే 45 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారం ఉంది.    
– చల్లా మణికాంత్, సీఈవో స్టోరీటెక్‌

మరిన్ని వార్తలు