ఒకే దేశం..  ఒకే డిగ్రీ! 

22 Dec, 2018 02:07 IST|Sakshi

ఇక దేశవ్యాప్తంగా ఒకటే సిలబస్‌

కేంద్రం ఆదేశాలతో యూజీసీ కసరత్తు

ఈ నెలాఖరు కల్లా మోడల్‌ సిలబస్‌ ప్రకటన

 అనంతరం దానికనుగుణంగా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల సిలబస్‌లో వచ్చే ఏడాది సమూల మార్పులు జరగనున్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో ఒకే తరహా సిలబస్‌ను అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఇందులో మెజార్టీ యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు దేశ వ్యాప్తంగా ఒకే తరహా డిగ్రీ సిలబస్‌ ఉండేలా మార్పులు తీసుకువచ్చేందుకు అంగీకారం తెలిపారు. దీంతో యూజీసీ ఈ నెలాఖరులో మోడల్‌ సిలబస్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది.

అనంతరం ఆయా రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలు రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా 20 శాతం నుంచి 30 శాతం వరకు సిలబస్‌ను మార్పు చేసుకునే వీలు కల్పించనుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు మోడల్‌ సిలబస్‌ రాగానే స్థానిక అవసరాల మేరకు సిలబస్‌లో మార్పులకు చర్యలు చేపట్టేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మిగతా 70 శాతం నుంచి 80 శాతం సిలబస్‌ జాతీయ స్థాయిలో ఒకే తరహాలో ఉండేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనుంది.   

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా.. 
ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డిగ్రీ సిలబస్‌ ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు మార్కుల విధానం అమలు అమలు అవుతోంది. ఎక్కడా సమానత్వం ఉండటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో 75 శాతానికి మార్కులు మించకపోతే మరికొన్ని రాష్ట్రాల్లో 95 శాతం వరకు మార్కులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకేలా రకమైన బోధన, పాఠ్యాంశాల రూపకల్పన, మార్కుల విధానం తీసుకువచ్చే చర్యలను కేంద్రం చేపట్టింది. మరోవైపు భాషలు, చరిత్ర వంటి పుస్తకాల్లో అవసరంలేని అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ ఉంది. దేశంలోని ప్రముఖులకు సంబంధించిన పాఠ్యాంశాలకు చోటు లేకుండా పోయింది.

ప్రస్తుతం వాటన్నింటిని పరిశీలించి దేశీయ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసి మోడల్‌ సిలబస్‌ను ప్రకటించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక 2016లో కేంద్రం ప్రవేశపెట్టిన చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టంకు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చినా, జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా మరిన్ని మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనూ మార్పు చేసిన పాఠ్య పుస్తకాలను 2016–17 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పుడు ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల ఫైనల్‌ ఇయర్‌ ఈ విద్యా సంవత్సరంతో ముగియనుంది.

కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌ను రూపొందించి అమల్లోకి తీసుకురానుంది. గతేడాది రాష్ట్రంలో డిగ్రీ ఇంగ్లిషులో మార్పులు తేవాలని భావించినా కోర్సు మధ్యలో అలా చేయడం కుదరదని, విద్యార్థులు గందరగోళానికి గురవుతారని వర్సిటీలు వ్యతిరేకించాయి. దీంతో ఉన్నత విద్యా మండలి మిన్నకుండిపోయింది. గతంలో మార్పు చేసిన సిలబస్‌లో చేరిన వారి ఫైనల్‌ ఇయర్‌ ఇప్పుడు పూర్తి అవుతున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌ను డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. 

>
మరిన్ని వార్తలు