తెలంగాణలో రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు

6 May, 2020 20:01 IST|Sakshi

పలుచోట్ల మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగాతూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావాలతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ బహుదూర్‌పుర మండలంలోని పలు ప్రాంతాల్లోనూ, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం జహనుమాలోనూ, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లలో మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఇక గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. అలాగే గురువారం అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు