నేడు అల్పపీడనం

25 Apr, 2019 03:02 IST|Sakshi

రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో శ్రీలంకకు ఆగ్నేయ దిశగా గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 36 గంటలలో వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు ప్రయాణించి, ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు.

దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో గురువారం తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు. శుక్రవారం మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో 43 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 42 డిగ్రీలు, ఖమ్మం, హన్మకొండలలో 40 డిగ్రీలు, హైదరాబాద్, నల్లగొండలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు