గ్రేటర్‌ను వీడని వాన.. జనం హైరానా! 

21 Aug, 2018 02:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్‌ నగరంలో సోమవారం ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 7 గంటల వరకు నగరంలో సరాసరిన 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

మరో రెండు రోజులపాటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించింది. వీధి వ్యాపారాలు గిరాకీ లేక బోసిపోయాయి. పలు ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు వారి గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు