రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

3 Jun, 2020 05:23 IST|Sakshi

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం  

సాక్షి, హైదరాబాద్‌: నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుం చి 40 కి.మీ. వేగంతో) పాటు తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ది పేట, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణించి మంగళవారం తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో పాంజిమ్‌ (గోవా)కు పశ్చిమ దిశగా 280 కి.మీ., ముంబైకు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ., సూరత్‌ (గుజరాత్‌)కు దక్షిణ నైరుతి దిశగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటలలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరిన్ని వార్తలు