పాఠాలు చూడొచ్చు.. వినొచ్చు 

9 Feb, 2019 00:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 8వ తరగతి ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టు పుస్తకాలను అభివృద్ధి చేసి, వాటిల్లో క్విక్‌ రెస్పాన్స్‌ (క్యూఆర్‌) కోడ్‌ పొందుపరిచేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చర్యలుచేపట్టింది. ప్రతి పాఠానికి సంబం ధించిన వివిధ అంశాలపై వీటిని అభివృద్ధి చేసింది. ఈనెల 11 నుంచి 14 వరకు వాటిని సమీక్షించి పుస్తకాల్లో పొందుపరచాలని నిర్ణయించింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచే క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా విద్యార్థులు ఆ కోడ్‌ను ఎలక్ట్రానిక్‌ పరికరం లేదా మొబైల్‌ సహాయంతో రీడ్‌ చేస్తే ఆ పాఠ్యాంశానికి ఆడియో, వీడియోతో మొబైల్‌లో ప్రత్యక్షం అయ్యేలా చర్యలు చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీక్ష కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ శేషుకుమారి తెలిపారు. మొదట ప్రయోగాత్మకంగా 8వ తరగతి ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో వీటిని పొందుపరచాలని నిర్ణయించామని, దీనిని 2019–20 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెస్తామని ఆమె వెల్లడించారు. ఇది సక్సెస్‌ అయితే అన్ని తరగతుల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.  

మరిన్ని వార్తలు