అధునాతన వైపు ఆబ్కారీ.. 

29 Jan, 2018 14:29 IST|Sakshi
ట్యాబ్‌ను చూపుతున్న ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  కె.రాజ్యలక్ష్మి

     ఎక్సైజ్‌ అధికారులకు ల్యాప్‌ట్యాబ్‌లు 

     ఆన్‌లైన్‌లోనే పూర్తి సమాచారం 

     అక్రమ దందాలకు యాప్‌తో నియంత్రణ

     ఈవెంట్‌లో మద్యం అనుమతులకు ఇక ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు 

ఆదిలాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తోంది. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ, అనుమతులు తదితర వాటిని పొందుపరుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా తెచ్చిపెడుతున్న ఎక్సైజ్‌ శాఖలోనూ ప్రజలకు చేరువయ్యేలా ‘ఆన్‌లైన్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పోలీసుశాఖను ఆధునిక సాంకేతిక వైపు తీసుకెళ్తున్న ప్రభుత్వం తాజాగా అదే దారిలో ఆబ్కారీ శాఖను తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ల్యాప్‌ట్యాబ్‌లు అం దజేసింది. ఈ ట్యాబ్‌ల ద్వారా సాంకేతికతను ఉపయోగించుకొని అధునాతన సేవలు అందించనున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతా ల్లో గుడుంబా నివారణలో భాగంగా గుడుంబా తయారీదారులకు పునరావాస పథకం కింద ఆర్థికసాయం అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఎక్సైజ్‌శాఖ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ట్యాబ్‌లను అందజేసింది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌స్థాయి నుంచి కమిషనర్‌ స్థాయి వరకు ట్యాబ్‌లు అందించిన ప్రభుత్వం నిత్యం వారి విధులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో అనుసంధానించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  


జిల్లా పరిధిలో.. 


ఎక్సైజ్‌శాఖ పరిధిలో జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఒక సూపరింటెండెంట్, ఆరుగురు ఎస్సైలు ఉన్నారు. సూపరింటెండెంట్, సీఐలకు ప్రభుత్వం ఇప్పటికే ట్యాబ్‌లు కేటాయించగా త్వరలో ఎస్సైలకు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కల్తీ కల్లు నుంచి గుడుంబా విక్రయాల వరకు అక్రమ మద్యం రవాణా చేసే వారి సమాచారం వరకు ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ద్వారా వివరాలు నమోదు చేసి ఆన్‌లైన్‌లో ఉన్నత అధికారులకు నివేదికలు పంపించే విధానం అమలులోకి వచ్చింది. నిత్యం తమ విధుల్లో భాగంగా తనిఖీలు, స్వాధీనం చేసుకునే గుడుంబా, దేశీదారు, బెల్లం, కేసులు, మద్యం దుకాణాల్లో జరిగే కల్తీదందా, అధిక ధరలకు విక్రయించే వారిపై తీసుకునే చర్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ట్యాబ్‌లు వెంట తీసుకొని వెళ్లి ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పరిస్థితులను చూపించే అవకాశాలు ఉన్నాయి.  


అక్రమ దందాలకు చెక్‌.. 


మద్యం దుకాణాల్లో జరిగే అక్రమ దందాలకు సంబంధించి వెంటనే అడ్డుకట్ట వేసేందుకు ట్యాబ్‌లను వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్సైజ్‌ యాప్‌ను రూపొందించారు. వినియోగదారులు ఎవరైనా మద్యం దుకాణాల్లో జరిగే కల్తీ, అధికధరల విక్రయాలు, నాన్‌ డ్యూటీ మద్యానికి సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే యాప్‌ ద్వారా ఆయా దృశ్యాలను చిత్రీకరించి అప్‌లోడ్‌ చేయడం ద్వారా వెంటనే దానిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తే సంబంధిత ఎౖMð్సజ్‌ శాఖ పరిధిలోని అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి అవకాశాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకొని అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని అధికారులు సూచిస్తున్నారు.  


ఆన్‌లైన్‌లో అనుమతులు.. 


జిల్లాలో ఎవరైనా ఈవెంట్‌ అనుమతి కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  tsexise.cgg.gov వెబ్‌సైట్‌ను రూపొందించింది. వెబ్‌సైట్‌లో ఈవెంట్‌కు సంబంధించిన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును వెంటనే సంబంధిత ప్రాంత అధికారులతో వివరాలు తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను బట్టి ఆన్‌లైన్‌లోనే అనుమతి మంజూరు చేస్తారు. శుభకార్యం నేపథ్యంలో మద్యం ఏర్పాట్లు చేసుకునే వారు ఎక్సైజ్‌శాఖ అనుమతి తీసుకోవాలి. ఇలాంటి అనుమతుల కోసం గతంలో ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు అన్ని ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయి.  


ఆన్‌లైన్‌ సేవలు.. 


ఎక్సైజ్‌శాఖ అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే పొందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అధికారులకు ట్యాబ్‌లు అందించారు. వీటి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతో పాటు అధికారులకు వెంటనే సమాచారం అందించవచ్చు. ఈవెంట్‌ అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం అమలులోకి వచ్చింది.
 

మరిన్ని వార్తలు