ఆగస్టులో రష్యా టీకా?

16 Jul, 2020 05:43 IST|Sakshi

సురక్షితం కాబట్టి ఇస్తామంటున్న శాస్త్రవేత్త  

మూడో దశకు మోడెర్నా టీకా  

పొగాకు లాంటి మొక్కతో రంగంలోకి మరో కంపెనీ!

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసుల సంఖ్య ఒకవైపు పెరిగిపోతున్నప్పటికీ.. ఈ వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్‌ విషయంలో ఆశలూ పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికన్‌ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ఈ నెల 27న మొదలు కానుండగా.. ప్రయోగాల దశల విషయంలో కొంత సందిగ్ధత ఉన్న సెషనోవ్‌ యూనివర్సిటీ (రష్యా) టీకా ఆగస్టు 12 –14 కల్లా విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశకు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది లోపు ఏదో ఒకటి కోవిడ్‌–19 నుంచి విముక్తి కల్పించవచ్చునన్న ఆశలు బలపడుతున్నాయి. 

రష్యాలోని సెషనోవ్‌ వర్సిటీ తయారు చేసిన టీకా ప్రపంచంలోనే తొలి కరోనా నిరోధక టీకా అన్న వార్తలు రెండ్రోజుల క్రితమే వెలువడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాకు చెందిన క్లినికల్‌ ట్రయల్స్‌ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఈ టీకా ఇప్పటికీ ఒకటో దశ మానవ ప్రయోగాల్లోనే ఉంది. ఈ అంశంపై రష్యా వర్సిటీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. గత నెల 18, 23వ తేదీల్లో జరిపిన రెండు ప్రయోగాల్లో టీకా సురక్షితమని తేలినట్లు వార్తలొచ్చాయి. టీకా తయా రు చేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం సెషనోవ్‌ వర్సిటీలోని ఒక విభాగానికి నేతృత్వం వహిస్తున్న అలెగ్జాండర్‌ లుకషేవ్‌ వ్యాక్సిన్‌ను వచ్చే నెల మధ్యలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫార్మా సంస్థలు ఈ టీకాను సెప్టెంబరు నుంచి భారీ మోతాదుల్లో ఉత్పత్తి చేయవచ్చునని కూడా ఆయన తెలిపినట్లు సమాచారం. 

పది రోజుల్లో మూడో దశకు మోడెర్నా టీకా...
కరోనా టీకాకు అందరికంటే ముందుగా మానవ ప్రయోగాలు మొదలుపెట్టిన సంస్థ మోడెర్నా. తొలి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఇప్పుడు జూలై 27 నుంచి మూడో దశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అమెరికాలో సుమారు 30 వేల మందిపై జరిగే ఈ ప్రయోగాల ద్వారా కరోనాను నిరోధించే విషయం లో ఈ టీకా ఎంత సమర్థమైందో స్పష్టం కానుంది. నిజానికి ఈ నెల తొలివారంలోనే మూడో దశ ప్రయోగాలు మొదలు కావాల్సి ఉండగా, ఫేజ్‌–2 ప్రయోగ ఫలితాల ప్రచురణలో జరిగిన జాప్యంతో ఆలస్యమయ్యాయి.

వ్యాక్సిన్‌ సురక్షితమైంది మాత్రమే కాకుండా కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతమైనట్లు రెండో దశ ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. తొలిదశ ప్రయోగాల్లో 45 మందికి టీకా అందివ్వగా వారందరిలోనూ వైరస్‌ వ్యతిరేక యాం టీబాడీలు ఉత్పత్తి అయినట్లు న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ద్వారా స్పష్టమైంది. మూడో దశ ప్రయోగాల్లో మొత్తం 30 వేల మంది పాల్గొంటుండగా.. వీరిలో సగం మందికి అసలు టీకా వంద మైక్రోగ్రాముల చొప్పున, మరి కొందరికి ఉత్తుత్తి టీకా ఇస్తారు. ఆ తరువాత వీరిలో ఎవరికైనా కరోనా సోకిందా? అన్నది పరిశీ లిస్తారు. ఒకవేళ సోకితే లక్షణాలు తీవ్రం కాకుండానైనా టీకా నిరోధించిందా? అన్నది పరిశీలిస్తారు. అంటే..వ్యాధి తీవ్రత తగ్గించగలిగినా వ్యాక్సి న్‌ విజయవంతమైనట్లే లెక్క. ఈ అధ్యయనం 2022 అక్టోబర్‌ వరకూ కొనసాగనున్నప్పటికీ ప్రాథమిక ఫలితాల ఆధారంగా టీకాను అందరికీ అందుబాటులోకి తేవాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. 

పొగాకు లాంటి మొక్క నుంచి..
కరోనా నిరోధానికి టీకాను అభివృద్ధి చేసేందుకు గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ బీచెమ్‌ (జీఎస్‌కే) వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. కెనెడా కంపెనీ మెడికాగో పొగాకును పోలిన నికోటియానా బెంథమియానా మొక్క నుంచి కరోనా వైర స్‌ను పోలిన కణాలను తయారు చేయగా వాటి సాయంతో వైరస్‌ పనిపట్టేందుకు జీఎస్‌కే టీకా ను అభివృద్ధి చేస్తోంది. రెండ్రో జుల క్రితం ఈ టీకాను 180 మందికి అందించారు కూడా.

వేర్వేరు మోతాదుల్లో ఈ టీకాను ఇవ్వడంతోపాటు జీఎస్‌కే, డైనావ్యాక్స్‌ టెక్నాలజీలు తయారు చేసిన 2 సహాయక మందులను కూడా అందించారు. ఒకే ఒక్క డోసుతోనే ఈ టీకా శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేయగలదని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేసేందుకు జీఎస్‌కే  ఫార్మా కంపెనీ సనోఫీతో ఒప్పందం కూడా చేసుకుంది. అన్నీ సవ్యంగా సాగితే సెప్టెంబరులో ప్రయోగాలు మొదలు కానున్నాయి. వచ్చే ఏడాదికల్లా 100 కోట్ల టీకాలు తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు