పెట్టుబడిదారుల సదస్సుకు నిర్వహణ కమిటీలు

10 Oct, 2017 04:40 IST|Sakshi

ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ సీఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో 8 కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ సోమవారం జారీ చేశారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకుగాను నీతి ఆయోగ్‌ చేసిన సూచనల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవంబర్‌ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంక ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు హాజరు కానున్నారు.

నవంబర్‌ 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాల అధిపతులతో నగర సుందరీకరణ కమిటీ, రవాణా ఏర్పాట్ల కమిటీ, ట్రాఫిక్‌ నిర్వహణ, కంట్రోల్‌ రూం ఆపరేటర్ల కమిటీ, వలంటీర్‌ కమిటీ, ఎయిర్‌పోర్ట్, రిసెప్షన్‌ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ రిసెప్షన్‌ కమిటీ, మీడియా కో ఆర్డినేషన్‌ కమిటీ, సెక్యూరిటీ కో ఆర్డినేషన్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు సమావేశమై ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం కోరింది. ఏర్పాట్ల పరిశీలనకు అమెరికా ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్‌ నుంచి ప్రతినిధుల బృందం త్వరలో రానుందని తెలిపింది. సదస్సుకు ఆహ్వానించాల్సిన అతిథులు, ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, వీవీఐపీలకు కానుకలు, స్పాన్సర్ల గుర్తింపు తదితర బాధ్యతలను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించింది.     

మరిన్ని వార్తలు