మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి

15 Nov, 2014 02:10 IST|Sakshi
మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి
 • అభినందన సభలో బండారు దత్తాత్రేయ
 •  కేంద్రమంత్రి హోదాలో తొలిసారి నగరానికి రాక
 •  శంషాబాద్ విమానాశ్రయం నుంచి కార్యకర్తల ఘనస్వాగతం
 •  రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి పద్మారావు
 • సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.

  అనంతరం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిచేస్తామని తెలిపారు.మోదీ కేబినెట్‌లో కార్మిక,ఉపాధి శాఖ లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

  తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... దత్తాత్రేయకు కీలక శాఖను కేటాయించినందుకు  తెలంగాణ ప్రజలు, కార్యకర్తల తరఫున ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

  బీజేఎల్పీనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు దత్తాత్రేయకు ప్రధాని మోదీ అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, నేతలు ఎస్వీ శేషగిరిరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు