పీజీ మెడికల్‌ ఫీజుల ఉత్తర్వుల మార్పు

27 May, 2020 05:25 IST|Sakshi

మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులపై హైకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను మంగళవారం సవరించింది. గత 20వ తేదీ నాటి ఉత్తర్వుల వల్ల విద్యార్థులపై ఫీజుల భారం 75 శాతం వరకు ఉంటుందని సుదీప్‌ శర్మ సహా 121 మంది పీజీ మెడికల్‌ విద్యార్థులు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనల తర్వాత విద్యార్థుల వాదనను ఆమోదించింది. ఫీజుల్ని పెంచుతూ గత ఏప్రిల్‌ 14న జారీ చేసిన జీవో 20లో ప్రకటించిన ఫీజుల మొత్తంలో ఏ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, బీ కేటగిరీ విద్యార్థులు 60 శాతం చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

గత ఉత్తర్వుల్లో 2016 నాటి ఫీజుతో పాటు తాజాగా పెంచిన ఫీజులో 50/60 శాతం చొప్పున ఆ రెండు కేటగిరీల వారూ చెల్లించాలంది. ఈ విధంగా ఫీజుల వసూళ్లకు అనుమతినివ్వాలని, మధ్యంతర ఉత్తర్వులను మార్పు చేయవద్దని కాలేజీ యాజమాన్యాల న్యాయవాదులు కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 20 నాటి మధ్యంతర ఉత్తర్వులను మార్పు చేయాలని, లేకపోతే పాత జీవోలోని మొత్తం ఫీజు, కొత్త జీవోలో 50/60 శాతం వసూలు చేయాలన్న ఉత్తర్వుల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, కాలేజీ యా జమాన్యాలకే మేలు జరుగుతుందని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ధర్మాసనం.. కొత్త జీవో 20లో నిర్ణయించిన ఫీజులో 50/60 శాతం చొప్పున ఆ రెండు కేటగిరీలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు