ప్రజాకవి నిస్సార్‌ను కాటేసిన కరోనా

9 Jul, 2020 01:49 IST|Sakshi

గాంధీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎగసిన కెరటం

తన ఆటపాటలతో స్ఫూర్తి రగిల్చిన గాయకుడు

కరోనా కష్టాలపైనే ఆఖరి పాట

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాకవి, రచయిత, గాయకుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి సహాయ కార్యదర్శి మహ్మద్‌ నిస్సార్‌ను (58) కరోనా కాటేసింది. ఈ మహమ్మారి సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం కన్నుమూశారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు పడిన కష్టాలను బాధలను పేర్కొంటూ‘ముదనష్టపు కాలం.. ఇంకెంతకాలం’అంటూ ఇటీవలే ఓ పాట పాడారు. అదే ఆయన చివరి పాట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో లక్షలాది మందిని ఉద్యమ పథంలోకి నడిపిన నిస్సార్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం.

మహ్మద్‌ అబ్బాస్, హలీమా దంపతులకు 1962 డిసెంబర్‌ 16న ఆయన జన్మించారు. సుద్దాల హనుమంతుతోపాటు సుద్దాల అశోక్‌తేజ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న నిస్సార్‌.. సీపీఐ కార్యకర్తగా, తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుడిగా తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన పదునైన కంచుకంఠంతో పాడిన పాటలు గొప్ప చైతన్యాన్ని కలిగించాయి. ఈ క్రమంలో ప్రజాగాయకుడు గద్దర్‌ స్ఫూర్తిని అందుకుని ఎన్నో పాటలు పాడారు. పలు కవితలు కూడా రాశారు. దోపిడీ, పీడనలు, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు. 

ప్రజానాట్యమండలి సహా పలువురి సంతాపం.. 
నిస్సార్‌ మృతిపట్ల తెలంగాణ ప్రజా నాట్యమం డలి రాష్ట్ర కౌన్సిల్‌ తీవ్ర సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఆట–పాట–మాట, ధూంధాం కార్యక్రమాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తూ, ప్రజల సమస్యలను ఇతివృత్తాలుగా చేసుకుని అనేక జానపద గేయాలు, ప్రజల పాటలను రాసిన వాగ్గేయకారుడు నిస్సార్‌ అని కందిమళ్ల ప్రతాపరెడ్డి, పల్లె నర్సింహ, కె.శ్రీనివాస్, కన్నం లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, జాకబ్, కొండల్‌రావు, పి.నళిని నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్ర మలిదశ పోరాటంలో నిస్సార్‌ అద్భుతమైన పాటలు రాశారని, అనేక ప్రజా పోరాటాల్లో, పుట్టిన సుద్దాల గురించి రాసిన పాటలతో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ జోహార్లు అర్పించారు. నిస్సార్‌ వంటి కళాకారుడు వైరస్‌కు బలి కావడం విచారకరమని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిస్సార్‌ మరణంతో పార్టీకి, ప్రజానాట్యమండలికి తీరని నష్టం వాటిల్లిందని ఏఐటీయూసీ నాయకులు టి.నరసింహన్, ఎస్‌.బాలరాజ్, వీఎస్‌ బోస్, ఎండీ యూసుఫ్‌ విచారం వెలిబుచ్చారు. 

ఆర్టీసీ ఉద్యోగిగా... 
కళాకారుడిగా జీవన ప్రస్థానం ప్రారంభించినప్పటికీ ఉపాధి కోసం నిస్సార్‌ అనేక పనులు చేశారు. లారీ క్లీనర్‌గా, డ్రైవర్‌గా కొంతకాలం పనిచేశారు. అనంతరం ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో చాలాకాలం పాటు ఆ ఉద్యోగం చేస్తూనే కళాకారుడిగా ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం గజ్జెకట్టారు. తెలంగాణలోని అన్ని డిపోల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన సాంస్కృతిక యోధుడిగా నిలిచారు. ప్రస్తుతం మియాపూర్‌–2 డిపోలో ఏడీసీగా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన నిస్సార్‌ను పడకలు ఖాళీ లేవంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకోలేదని, చివరకు గాంధీ ఆస్పత్రిలో చేర్చుకున్నప్పటికీ, వెంటిలేటర్‌ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తంచేశాయి. నిస్సార్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. 

మరిన్ని వార్తలు