పోలీస్‌ వాహనంపై కూర్చుని.. వారికే వార్నింగ్‌ ఇస్తూ

19 Jul, 2019 11:21 IST|Sakshi

వార్నింగ్‌ ఇస్తూ సినిమా డైలాగులు

వివాదాస్పదంగా మారిన హోం మంత్రి మనవడి వీడియో

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా, సైబర్‌ అనర్థాలపై అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ ట్విటర్‌లో రోజూ పౌరులను హెచ్చరిస్తూ ఉంటారు. విచిత్రంగా ఆయన పేరిట రిజిష్ట్రర్‌ అయిన ఓ వాహనంపై ఏకంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మనవడు, అతడి స్నేహితుడు కలసి డిపార్ట్‌మెంట్‌కు వ్యతిరేకంగా చేసిన టిక్‌టాక్‌ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఐజీస్థాయి అధికారిని నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పీక కోస్తా అంటూ బెదిరిస్తూ చెప్పే ఓ సినిమా డైలాగ్‌ ఉంది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సదరు వీడియోపై గురువారం డీజీపీ కార్యాలయంలోనూ చర్చ జరిగింది. విషయం డీజీపీ, ఏడీజీ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. డీజీపీ కార్యాలయం సమాచారం ప్రకారం.. ఆ వీడియో పాతదని, కారుపై కూర్చున్న యువకుడు హోంమంత్రి మనవడు కాగా, డైలాగులు చెప్పిన యువకుడు అతడి స్నేహితుడని తెలిపారు. హోంమంత్రి భద్రత కోసం కేటాయించిన కార్లలో అది కూడా ఒకటని తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రతి పోలీసు వాహనం డీజీపీ పేరుతో రిజిస్టర్‌ అయి ఉంటుందని వివరణ ఇచ్చారు.

సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని ఇలా అభ్యంతరకరంగా వీడియో చిత్రించడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు