షాహెద్‌.. మనసున్న మారాజు!

18 Mar, 2020 10:31 IST|Sakshi
ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్నాక్స్‌ ఇస్తూ...

అతనిది ముషీరాబాద్‌ ఏక్‌మినార్‌ మసీదు ఎదుట ఓ చిన్న కూల్‌ డ్రింక్స్‌ దుకాణం. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో చాలా మందికి సామాజిక కార్యకర్తగా పరిచయం. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేయడం అతని వృత్తి అయితే సేవా కార్యక్రమాలు ప్రవృత్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ఏ సాయం కావాలన్నా తనకు తోచిన రీతిలో సహకరిస్తారు.

ముషీరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలోనే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలు ఆకలితో చదువు మీద దష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముషీరాబాద్‌ ఏక్‌మినార్‌ మసీదు వద్ద ఉండే సామాజిక కార్యకర్త మహ్మద్‌ షాహెద్‌ చిన్నారుల ఆకలిని చల్లార్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గడచిన ఐదేళ్లుగా క్రమం తప్పకుండా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియంలకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులకు రోజూ స్నాక్స్‌ను అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. అరటిపండ్లు, మిక్చర్, జ్యూస్, వాటర్‌ బాటిల్, బిస్కెట్‌ ప్యాకెట్స్, గ్లూకోజ్‌ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్‌ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం స్నాక్స్‌ అందిస్తున్నారు. రోజూ ఒక విద్యార్థికి రూ. 25 చొప్పున ఒక రోజు వంద మందికి రూ. 2,500 40 రోజుల మీద షుమారు లక్ష రూపాయల పరోక్ష సహాయాన్ని అందిస్తున్నారు. షాహెద్‌ సేవాభావాన్ని పోలీసు, విద్యా శాఖ అధికారులు, పలువురు రాజకీయ నాయకులు అభినందిస్తున్నారు.

సహాయం చేయడంలో ఎంతో ఆనందం
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా నా సహయం కోరితే వారికి నాకు తోచిన సహాయం చేయడం నా బాద్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకో పోయినా కష్ట పడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయడం నేను సంతోషంగా భావిస్తాను. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు. నాకున్న దాంట్లో నేను ఎంత సహయం చేస్తున్నానో అదే ముఖ్యం.– షాహెద్, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు