కాకి లెక్కలు

14 Feb, 2019 11:33 IST|Sakshi

పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఏరులై పారిన మద్యం.. యథేచ్ఛగా డబ్బుల పంపిణీ సర్వవిధితమే.. పోటా పోటీగా సాగిన అభ్యర్థుల ఖర్చులు చర్చనీయాంశంగా మారాయి. మేజర్‌ పంచాయతీల్లో రూ. కోటిన్నర వరకు అభ్య ర్థులకు వ్యయం అయినట్లు అంచనా.. కాగా వారు ఎన్నికల సంఘానికి చూపిన లెక్కలు విస్మయపరుస్తున్నాయి.

మోర్తాడ్‌ (బాల్కొండ): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ప్రచార ఖర్చు లెక్కలను మొక్కుబడిగానే చూపారని తెలుస్తోంది. అభ్యర్థులు ప్రచారం కోసం రూ.లక్షలు కుమ్మరించగా ఎన్నిక ల సంఘానికి మాత్రం రూ.వేలల్లోనే ఖర్చు చేసినట్లు చూపి నట్లు అభ్యర్థులు వ్యయ పరిశీలకులకు అందించిన నివేదికలను పరిశీలిస్తే వెల్లడవుతోంది. గడచిన ముందస్తు శాసనసభ ఎన్నికలను తలపించేలా పంచాయతీ ఎన్నికలు సాగా యి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్య ర్థి తమ గెలుపు కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్లు గ్రామాల్లో జరిగిన విందు రాజకీయాల ద్వారా స్పష్టమైంది. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్న లెక్కలను చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజామాబాద్‌ జిల్లాలో 330 గ్రామ పంచాయతీలకు గాను 4,932 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు సర్పంచ్, 11 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. అలాగే కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలకు గాను 4,642 వార్డు స్థానాలు ఉన్నాయి. కొన్ని పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాగా మరి కొన్ని చోట్ల, సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే కొన్ని పంచాయతీల్లో వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. అయితే అభ్యర్థులు నామినేషన్‌ వేసిన నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చేసిన ప్రచారంకు సంబంధించిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి అం దించాల్సి ఉంది. 5 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీ ల్లో సర్పంచ్‌ అభ్యర్థులు తమ ప్రచారం కోసం రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేయడానికి ఎన్నికల సంఘం పరిమితిని విధిం చింది. వార్డు సభ్యులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అలాగే 5 వేలకు తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1.50 లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.30వేల వరకు ప్రచారం కోసం ఖర్చు చేయవచ్చు.

వాల్‌ పోస్టర్లు, డోర్‌ స్టిక్కర్లు, మద్దతు దారులకు టీ, టిఫిన్, భోజనం, టెంట్, ఆటో లేదా ఇతర వాహనాలకు మైక్‌ సెట్‌ను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించడం తదితర వాటికి మాత్రమే అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంది. ఏకగ్రీవం అయిన స్థానాలను మినహాయించి పోటీ జరిగిన స్థానాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారని అంచనా. వార్డు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు.

మద్యం, మాంసాలతో విందులకే కాకుండా ప్రచార సామగ్రి కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితమైన ఖర్చులనే అభ్యర్థులు వ్యయ పరిశీలకులకు అందిస్తున్నారు. ఈనెల 9లోగా ఆయా మండలాల్లో అభ్యర్థులు తమ ప్రచారం లెక్కలను చూపాలని లేదంటే షోకాజ్‌ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించడంతో అభ్యర్థులు ఆదరబాదరగా లెక్కలను అప్పగించారు. మొక్కుబడిగా లెక్కలను రాసి తప్పుడు రసీదులను జత పరిచి వ్యయ పరిశీలకులకు ప్రచారానికి సంబంధించిన లెక్కలను అభ్యర్థులు అప్పగించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎన్నికల్లో చేసిన వ్యయానికి, చూపుతున్న లెక్కలకు ఎంతో వ్యత్యాసం ఉంది. 

మరిన్ని వార్తలు