సమస్యలకు చెక్

6 Jul, 2014 23:34 IST|Sakshi

కందుకూరు:మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఇకపై కూలిడబ్బుల పంపిణీ విషయంలో జాప్యాన్ని నివారించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి సమాయత్తమైంది. మధ్యలో ఏజెన్సీలు, సీఎస్‌పీల పంపిణీ గొడవ లేకుండా బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా కూలిడబ్బులను జమ చేసేలా ప్రయోగాత్మకంగా జిల్లాలోని కందుకూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇటీవల డ్వా మా అధికారులు ప్రకటించారు. దీంతో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో  పరిష్కారం లభించనుంది.

 సమస్యలను అధిగమించేందుకు..
 ఇప్పటి వరకు కూలీలు చేసిన పనులకు సంబంధించిన నగదును మండల పరిషత్ కార్యాలయం నుంచి ఎంత మందికి ఎంత కూలిడబ్బులు ఇవ్వాలో సీఆర్డీకి నివేదిస్తే, అక్కడి నుంచి నగదు బదిలీ ఆదేశాల ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చేరేది. ఆ బ్యాంక్ ఆధ్వర్యంలో మణిపాల్, ఫినో వంటి ఏజెన్సీల ద్వారా కూలీలకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. సీఎస్‌పీలు సమయానికి రాకపోవడం, బినామీలు వంటి పలు సమస్యలను అధికారులు గుర్తించారు.

 దీంతో అన్ని సమస్యలను అధిగమిస్తూ  క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా పని చేసేలా చేయడానికి ప్రయోగాత్మకంగా కందుకూరు మండలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. కూలీలకు నేరుగా ఆయా బ్యాంక్ ఖాతాల్లో కూలీ డబ్బు జమ అవుతుంది. దీంతో పాటు వారి సెల్ నంబర్‌కు జమ చేసిన వివరాలతో కూడిన మెసేజ్ చేరుతుంది. అవసరమైతే ఆ సెల్ నంబర్‌కు ఉన్నతాధికారులు ఫోన్ చేసి కూలీలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో అవకతవకలను నివారించే అవకాశం ఉంది. పథకం పటిష్టంగా అమలైతే కూలీ డబ్బులు అందలేదని ఆందోళన చెందాల్సిన అవసరం ఇకపై తప్పనుంది.

 పనులు ప్రారంభం..
 మండలంలో 15,453 జాబ్ కార్డులు ఉన్నాయి. 653 శ్రమశక్తి సంఘాల్లో 13,465 మంది కూలీలు పని చేస్తున్నారు. ప్రస్తుతం కూలీల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు సెల్ ఫోన్ నంబర్లను సిబ్బంది సేకరించే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తే తెలంగాణ రాష్ర్టమంతటా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు