నోటికి ఓటు

13 Jan, 2019 13:21 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సర్పంచ్‌ పదవి దక్కించుకోవడం భారంగా మారింది. పీఠమెక్కడానికి అర్హతలేకాదు.. ఆర్థిక వనరులు కూడా ముఖ్యమని తెలుస్తోంది. నోట్ల కట్టలను వెదజల్లకపోతే.. మందు, విందు  ఇవ్వకపోతే సర్పంచ్‌ పదవేకాదు ఆఖరికి వార్డు సభ్యుడిగా కూడా గెలిచే పరిస్థితి లేదు. రాజధాని చుట్టూరా ఉన్న రంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి రంగం ప్రభావం ఎక్కువ. దీంతో పంచాయతీల్లో పాగా వేయడానికి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రంగంలోకి దిగుతు న్నారు. పల్లె పోరులో సీనంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. ఎన్నికలకు నగారా మోగకముందే కొన్ని గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేవగా.. నామినేషన్ల పర్వం మొదలైందో లేదో ఇంకొన్ని పల్లెల్లో తాయిలాల వర్షం కురుస్తోంది.

ఇప్పటివరకు కుల సంఘాలు, యువజన సంఘాలకు మాత్రమే పరిమితమైన ప్యాకేజీలు.. తాజాగా ప్రతి ఇంటి దారి పట్టాయి. ఓటరన్నను ప్రసన్నం చేసుకునేందుకు నేరుగా ‘ఓటుకు నోటు’ సమర్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఓటరుకు నగదు ముట్టజెప్పడమే లక్ష్యంగా గ్రామాల్లో రాజకీయం సాగుతోంది. మరీ ముఖ్యంగా జనరల్‌ స్థానాల్లో ప్రలోభాల పర్వం పతాకస్థాయికి చేరింది. ఇన్నాళ్లు మందు, విందు, వినోదాలు కేవలం కొందరికే పరిమితం కాగా.. తాజాగా సంక్రాంతి సందడిని సైతం అభ్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. 

కోడ్‌ కూయకముందే.. 
ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ సర్పంచ్‌ గిరిపై కన్నేసిన ఓ యువకుడు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఎత్తుగడ వేశాడు. దీనికి డిసెంబర్‌ 31వ తేదీ అనువైనదిగా భావించాడు. కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అంటూ ప్రతి కుటుంబానికి ఓ బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్‌ పంపిణీ చేశాడు.  
మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లి గ్రామ పంచాయతీలోనూ ప్రలోభాలకు తెరలేచింది. ఓ అభ్యర్థి నోటిఫికేషన్‌ రాకమునుపే మద్దతుదారులకు స్మార్ట్‌ ఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇదే మండల పరిధిలోని ఘట్టుపల్లిలో ఓ అభ్యర్థి అనుచరులకు కలర్‌ టీవీలు, వాషింగ్‌ మెషీన్లు అందజేశాడు. 

యూత్‌కు గాలం! 
మీ యూత్‌లో ఎంతమంది ఉన్నారు. వారికి ఏమేమి కావాలి. హోటల్‌ వారికి చెబుతా. కావాల్సిన ఆహారపదార్థాలు తీసుకోండి. దీంతోపాటు ఫలానా వైన్‌షాపుకు వెళ్లి నాకు ఫోన్‌ చేయండి. కావాల్సిన బ్రాండ్‌ చెబుతా. ఇదీ.. నందిగామ మండలంలోని పలు గ్రామాలలో సర్పంచ్‌ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు యువతను ఆకట్టుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లు. ‘అన్నా మేం పది మంది పొరగాళ్లం ఊరు బయట ఉన్నాం. మాకు మందు కావాలని ఓ యువకుడు బరిలో ఉన్న అభ్యర్థిని అడిగిందే తడువు.. వారి  కోరికలు తీరుస్తున్నారు. మీరేమైనా అడగండి కానీ, మీ యూత్‌ మొత్తం మనకు ఓటు వేసేటట్లు చూడాలి అని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమలకు నెలవైన ఈ మండలంలో సర్పంచ్, వార్డు పదవులకు భారీగా డిమాండ్‌ పలుకుతోంది.
 
ఏకగ్రీవానికి ఎకరా భూమి? 
సర్పంచ్‌ పదవిని ఖరారు చేసినందుకు ప్రతిఫలంగా గుడి నిర్మించడానికి ఓ అభ్యర్థి తన పట్టా పొలంలో నుంచి ఎకరా భూమిని ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీలో ఈ అంగీకారం మేరకు సర్పంచ్‌ స్థానమే కాదు.. వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. అయితే, దేవాలయ నిర్మాణ వ్యయం భరించేందుకు వార్డు అభ్యర్థులు ఒప్పుకోవడంతో ఈ పంచాయతీ పరిధిలోని అన్ని పదవులకు సింగిల్‌ నామినేషనే నమోదైనట్లు తెలుస్తోంది. ఈ గ్రామంలో ఎకరా భూమి సుమారు రూ.60 లక్షలు పలుకుతోంది.  

బకరా.. బాటిల్‌! 

అభ్యర్థులకు సంక్రాంతి కలిసొచ్చింది. సరిగా ప్రచారం వేళ ఈ పండగ రావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు గాలం వేయడానికి సర్వశక్తులొడ్డుతున్నారు. పండగ ఘనంగా జరుపుకోవడానికి కుటుంబానికో మద్యం బాటిల్‌ పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. శంషాబాద్‌ మండలంలో ఇప్పటికే లిక్కర్‌ను డంప్‌ చేసిన అభ్యర్థులు.. ఒకే కుటుంబంలో ఎక్కువ ఓట్లు ఉంటే మద్యంతోపాటు మేకలు, కోళ్లు పంచడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పండగకు సొంతూరు వచ్చే ఓటర్లకు తాయిలాలు ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓటేయడానికి రానుపోను ఖర్చులను ఇప్పుడే చెల్లించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు