మనీ.. మందు.. మాంసం..!!

20 Jan, 2019 08:34 IST|Sakshi

ఖమ్మం, అన్నపురెడ్డిపల్లి: పంచాయతీ పోరులో ఓటర్లకు గాలం వేసేందుకు నాయకులు, అభ్యర్థులు తమ ‘అస్త్రాలు’ బయటకు తీస్తున్నారు. ఈ ‘అస్త్రాలు’ ఏమిటో తెలుసా..? ప్రధానంగా మూడు. ఒకటి– డబ్బు (మనీ). రెండు– మందు (మద్యం). నగదు, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకుగాను ఎన్నికల సంఘం ఎన్నో నిబంధనలు పెట్టింది. మందు, నగదును కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంది.  అయినప్పటికీ, అడ్డుకోలేకపోతోంది. అభ్యర్థులు, నాయకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.అసెంబ్లీ  ఎన్నికలలో నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బును నీళ్లలాగా ఖర్చు చేశారు.

ఓటరుకు  500 నుంచి 1000 రూపాయల వరకు పంచి  పెట్టారు. పోలీసులు, ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా పెట్టిన అసెంబ్లీ ఎన్నికలలో ధన ప్రవాహాన్ని అడ్డుకోలేపోయారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమవుతోంది. ములకలపల్లి  మండలంలో ఈ నెల 21న,  మిగిలిన అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఈ నెల 25న ఎన్నికలు జరుగుతాయి. ములకలపల్లి మండలంలో అభ్యర్థుల ప్రచారం ముగిసింది. మిగిలిన మండలాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని  ముమ్మరం చేశారు.

సర్పంచ్‌ అభ్యర్థులు భారీగానే ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల తరఫున నాయకులు ఓటర్ల ఇళ్లకు వెళుతున్నారు. నగదు, మద్యం ఇస్తున్నారు. గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడడం లేదు. ఒక్కో ఓటుకు 500 నుంచి 1000 రూపాయలు ఇస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఓట్లు వేయిం చాలంటూ కుల పెద్దలతో బేరసారాలు సాగి స్తున్నారు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పంచాయతీ జనాభానుబట్టి ఐదులక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు కొందరు అభ్యర్థులు  సిద్ధపడ్డారు. కులాలవారీగా  యువతను లోబర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

వారి కోసం మందు, మాంసం పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ చివరి రెండు రోజులలో ఇంటింటికీ వెళ్లి డబ్బులు పంచేందుకుగాను ఓటరు జాబితాను సిద్ధం చేసుకున్నారు. తమ ఓట్లు వేయిస్తే... వ్యక్తిగతంగా ఇచ్చే నగదు కాకుండా, కులం మొత్తానికి 40వేల నుంచి 50వేల రూపాయల వరకు ఇస్తామని నమ్మిస్తున్నారు. పోలీసుల తనిఖీలు, అబ్జర్వర్, ఫ్ల యింగ్‌ స్క్వాడ్, వీడియోగ్రఫీ, జోనల్‌ టీంలు... ఇ న్ని తిరుగుతున్నప్పటికీ మనీ–మందు–మాంసం ప్రవాహానికి అడ్డుకట్ట పడడం లేదు. 

మరిన్ని వార్తలు