నగదు రెడీ

2 May, 2018 03:00 IST|Sakshi
మంగళవారం ప్రగతి భవన్‌లో రైతు బంధు పథకం ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

బ్యాంకుల్లో రూ. 4,114 కోట్లు: కేసీఆర్‌ 

రైతు బంధు పథకం కింద పంపిణీకి సిద్ధం

చెక్కుల పంపిణీ సమయానికి మరో రూ.2 వేల కోట్లు 

52.72 లక్షల మంది రైతులకు చెక్కులు, పాస్‌ పుస్తకాలు 

10న పథకం ప్రారంభం.. ఉదయం 7–11 గంటలు..

సాయంత్రం 5–7.30 గంటల మధ్య చెక్కుల పంపిణీ 

ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రైతు బంధు పథకం ద్వారా రైతులకు అందించనున్న నిధులను బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. మే ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో రూ.4,114.62 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరో రూ.2 వేల కోట్ల నగదును విడుదల చేయించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు బుధవారం రిజర్వ్‌ బ్యాంకు అధికారులను కలుస్తారని చెప్పారు. త్వరలోనే ఈ డబ్బు వస్తుందని, చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యే నాటికి బ్యాంకుల్లో మొత్తం రూ.6 వేల కోట్లు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. రైతు బంధు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 57.33 లక్షల పాస్‌ పుస్తకాలు రైతులకు అందివ్వాలని నిర్ణయించాం. ఇందులో 4.60 లక్షల మంది ఆధార్‌ కార్డులను అనుసంధానం చేయలేదు.

ఆధార్‌ కార్డు అనుసంధానం చేసిన 52,72,779 మందికి చెక్కులు, పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5–7.30  గంటల మధ్య  నిర్వహించాలి. ఈ నెల 10న కార్యక్రమం ప్రారంభిస్తాం’’ అని సీఎం చెప్పారు. ఎస్‌బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, గ్రామీణ వికాస్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఐఓబీ, కార్పొరేషన్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంటుందన్నారు. రైతుల కోసం సిద్ధంగా ఉంచిన డబ్బును బ్యాంకర్లు ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని స్పష్టంచేశారు. రైతులకు ఇవ్వాల్సిన అన్ని చెక్కులు, అన్ని పాస్‌ పుస్తకాల ముద్రణ పూర్తయి, మండలాలకు చేరుకున్నాయని తెలిపారు.

రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ నెల 10 నుంచి మొదటి విడత డబ్బులను చెక్కుల రూపంలో అందించనుంది. సీఎం సమీక్షలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌ రావు, పార్థసారథి, రామకృష్ణారావు, రాజేశ్వర్‌ తివారి, శాంతా కుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్మోహన్‌రావు, భూ పరిపాలన డైరెక్టర్‌ వాకాటి కరుణ, ఐటీ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఓఎస్‌డీ రజిత్‌ షైనీ, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు