పెంబర్తి చెక్‌ పోస్ట్‌ వద్ద రూ. 5,80,65,000 స్వాధీనం

5 Dec, 2018 10:47 IST|Sakshi
పట్టుబడ్డ నగదు, నకిలీ రెండు వేల నోటును చూపిస్తున్న సీపీ

సాక్షి, జనగామ: జనగామ జిల్లా పెంబర్తి చెక్‌ పోస్ట్‌ వద్ద మంగళవారం రూ.5,80,65,000ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంచేందుకు హవాలా మార్గం (లెక్కలేని నగదు) ద్వారా పెద్ద మొత్తంలో తరలిస్తున్న డబ్బు కట్టలు పట్టుబడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు కారులో డబ్బు మూటలను తరలిస్తుండగా.. జనగామ జిల్లా వరంగల్‌–హైదరాబాద్‌ నేషనల్‌ హైవే.. మండలంలోని పెంబర్తి ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద చిక్కారు. కారు సీటు కింద ఉన్న  500 రూపాయల నోట్ల కట్టలు చూసిన పోలీసులు వెంటనే జిల్లా ఎలక్షన్‌ కమీషన్‌ ఉన్నతాధికారులతో పాటు పోలీస్‌ అధికారులకు సమాచారం అందించారు. జనగామ పట్టణ పోలీస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసరెడ్డితో కలిసి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ మాట్లాడారు. మంగళవారం తెల్లవారు జామున తనిఖీల్లో భాగంగా సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఏపీ 37సీకె 4985 నెంబరు గల షిఫ్టు కారును ఆపారని వారు తెలిపారు. అందులో డబ్బు అధిక మొత్తంలో ఉండడంతో కారును పట్టణ పోలీస్టేషన్‌కు తరలించి... వీడియోగ్రఫీ సమక్షంలో యంత్రాల ద్వారా లెక్కించినట్లు వివరించారు. 

హవాలా బ్రోకర్‌ ద్వారా డబ్బు సరఫరా 
పట్టు బడ్డు నిందుతులను ప్రశ్నించగా హైదరాబాద్‌ గోషామహల్‌కు చెందిన హవాలా బ్రోకర్‌ కీర్తి కుమార్‌ జైన్‌ షెల్‌ కంపెనీ ద్వారా నగదు సరఫరా చేస్తారన్నారు. అందులో భాగంగానే కొంత మందికి చెందిన నగదును తన షెల్‌ కంపెనీలో వేసుకుని, ప్రచారంకోసం ఆయా జిల్లాలకు చేరవేస్తున్నారన్నారు. జనగామలో పట్టుపడ్డ సొమ్ములో ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావుకు చెందిన రూ.1.50 కోట్లు, పరకాల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ భర్త కొండా మురళికి రూ.2.30 కోట్లు, వరంగల్‌ తూర్పు మహాకూటమి అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన రెండు కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నట్లు నిందితులు తమ విచారణలో ఒప్పుకున్నట్లు విలేకరులకు సీపీ వి. రవీందర్‌ చెప్పారు. 
నిందితుల అరెస్ట్‌...
నగదు తరలిస్తున్న హవాలా బ్రోకర్‌ కీర్తి కుమార్‌ జైన్, ఇద్దరు డ్రైవర్లు రాజస్తాన్‌కు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్న నవరాం, మహబూబాబాద్‌ జిల్లా పెదవంగర మండలం కన్వాయ్‌గూడెంకు చెందిన ముత్యం ప్రశాంత్‌పై 179/ఈడీ, 120/బీ(ప్రోజరీ)తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీపీ రవీందర్‌ పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌ చేసి, కారు, నగదును కోర్టుకు అప్పగించినట్లు 
ఆయన తెలిపారు.
ఈడీ విచారణ..?
పెంబర్తి చెక్‌ పోస్టు వద్ద పట్టుబడ్డ రూ.5.80 కోట్లకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సీపీ రవీందర్‌ చెప్పారు. ఈ నగదుకు సంబంధించి  నివేదికలు సిద్ధం చేసి, ఉన్నతాధికారులకు పంపించినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు