నిబంధనలు వర్తిస్తాయి!

11 Feb, 2019 12:33 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అటవీ సంపద, వృక్షాల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు టింబర్‌ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలకు గొంతులో వెలక్కాయలా మారాయి. రోజురోజుకూ వృక్ష సంపద అంతరించిపోతుండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీనిని నివారించేందుకు విస్తృతంగా మొక్కలు పెంచడంతోపాటు ఇప్పుడున్న అటవీ సంపద, వృక్షాలను కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ‘జంగల్‌ బచావో – జంగల్‌ బడావో’ కార్యక్రమం అమలులో భాగంగా తాజాగా తుమ్మ, వేప, మామిడి కలపకు వాల్టా చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

అంతేకాకుండా సామిల్లుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. మరోపక్క నిబంధనలు పాటించని సామిల్లులు, టింబర్‌ డిపోలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని 274 టింబర్‌ డిపోలు, సామిల్లుల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ టింబర్‌ మర్చంట్స్, సామిల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని వాటి యజమానులు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలతో తాము టింబర్‌ డిపోలను, సామిల్లులను నడపలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చదనం లోటు 25.62 శాతం..
జాతీయ అటవీ విధానం ప్రకారం భూభాగంలో మూడో వంతు పచ్చదనం ఉండాలి. కాని మన జిల్లాలో ఇదెక్కడా కనిపించడం లేదు. జిల్లా వైశాల్యం 7.5 లక్షల హెక్టార్లు కాగా.. ఇందులో ప్రస్తుతం 7.38 శాతం (సుమారు 55,350 హెక్టార్లు) మాత్రమే అడవులు, వృక్షాలు విస్తరించి ఉన్నాయి. ఈ పచ్చదనాన్ని మరో 25 శాతానికి పెంచితే.. నిర్దేశిత 33 శాతం పచ్చదనం సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో మొక్కల పెంపకం, అటవీ, వృక్ష సంపద సంక్షరణకు యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఇటీవల జిల్లాలోని టింబర్‌ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలు, అటవీ, పోలీస్‌ శాఖల అధికారులతో కలెక్టర్‌ లోకేష్‌ కుమార్‌ సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ నియమావళి ప్రకారం టింబర్‌ డిపోలు, సామిల్లుల యాజమానులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలన్నారు. కలప క్రయవిక్రయాల రికార్డులను నిర్వహించాలని సూచించారు. అయితే, ఈ షరతులు తమ పాలిట శరాఘాతంగా మారాయని టింబర్‌ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు