కేంద్రం దృష్టికి పెసర సమస్య

25 Sep, 2017 02:29 IST|Sakshi

నేడు కేంద్రానికి రాష్ట్ర అధికార బృందం: హరీశ్‌రావు

రాష్ట్రవ్యాప్తంగా వంద మక్క కొనుగోలు కేంద్రాలు

అక్టోబర్‌ మొదటి వారంలో వరి కేంద్రాలు

ప్రతి చివరి గింజను  కొనుగోలు చేస్తామని భరోసా

సిద్దిపేటజోన్‌: పెసర సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మార్కెటింగ్, భారీ నీటిపారుదల శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాష్ట్ర బృందం ఇదే సమస్యపై ఢిల్లీకి వెళ్లనుందని చెప్పారు. ఆదివారం సిద్దిపేటలో మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రారంభమైన తొలి కేంద్రమిది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పెసర పంటకు కేంద్రం నాణ్యతా ప్రమాణాలు కొంత ఇబ్బందిగా మారడంతో మద్దతు ధర సమస్య ఉత్పన్నం కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ధర తగ్గినప్పటికీ రూ.వెయ్యి కోట్లతో కందులను కొనుగోలు చేశామన్నారు. రైతుకు మద్దతు ధర అందించే దిశగా ఈ ఏడాది వంద మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 20 కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. 2–3 రోజుల్లో మిగతావి ప్రారంభిస్తామన్నారు.  రైతు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతో ఈసారి వరి రెట్టింపు దిగుబడి రానుందని మంత్రి చెప్పారు. అక్టోబర్‌ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. పత్తి కొనుగోలు కోసం సీసీఐ కేంద్రాలతో పాటు అవసరమైన చోట డిమాండ్‌కు అనుగుణంగా జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రైతులకు వెన్నుదన్నుగా సమితులు
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని హరీశ్‌రావు తెలిపారు. ఆయన చిన్నకోడూరు మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలు అడ్డుతగలడం భావ్యం కాదన్నారు. భూమి దున్నే ప్రతి రైతు సమన్వయ సమితిలో సభ్యుడన్నారు. 

మరిన్ని వార్తలు