టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌

4 Nov, 2017 12:50 IST|Sakshi

రేపు ఉట్నూరులో సభ

 ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు

 కాంగ్రెస్, టీడీపీల రెండోస్థాయి క్యాడర్‌పై దృష్టి

 భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రాక

 ధ్రువీకరించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌  మంత్రాన్ని పఠిస్తోంది. ఇటీవల టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. చెన్నూరు నుంచి మాజీ మంత్రి బోడ జనార్దన్, బోథ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, సిర్పూరు నాయకుడు రావి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి బలం పెరిగినట్లయింది. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడమే జరుగుతూ వచ్చింది. మరో ఏడాదిన్నర కాలంలో సాధారణ ఎన్నికలు, 

త్వరలోనే పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ బలం పెరగడం టీఆర్‌ఎస్‌ నేతలకు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నేతలు శ్రీకారం చుట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ అయి చేరికల సభ నిర్వహణ విషయమై చర్చించారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉట్నూరులో టీఆర్‌ఎస్‌ సభ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. కుమురం భీం జిల్లాకు చెందిన వారు కూడా ఈ సభకు రానున్నట్లు రాష్ట్ర మంత్రి అల్లోల  ఇంద్రకరణ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు హాజరుకానున్న ఈ సభ ద్వారా టీఆర్‌ఎస్‌ బలం ఏమాత్రం తగ్గలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్నారని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. మిగిలిన వారితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులపై దృష్టి సారించాలని పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ద్వితీయ శ్రేణి నాయకులే...
టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్‌ చేపట్టాలనుకున్నప్పటికి ప్రస్తుతం ఆ స్థాయిలో పెద్ద నేతలు ఎవరు ఇతర పార్టీలో నుంచి వచ్చే పరిస్థితి లేదు. టీడీపీకి చెందిన ముఖ్య నాయకులందరూ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. కుమురం భీం, నిర్మల్‌ జిల్లాల టీడీపీ అధ్యక్షులు పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పార్టీలోని మిగిలిన శ్రేణులపై దృష్టి సారించారు. తద్వారా ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలనే ప్రణాళికతో పావులు కదుపుతున్నారు. టీడీపీలో మిగిలిన వారిని టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌తో పాటు పలువురు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిర్మల్‌లో జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్‌తో పాటు పలువురు నేతలు గతంలో రాథోడ్‌ రమేష్‌తో పాటు కలిసి అధికార పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ చివరి సమయంలో లోలం దూరంగా ఉన్నారు. 

కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వంపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. గతంలో కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఖానాపూర్‌ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత పైడిపెల్లి రవిందర్‌రావు ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అదే సమయంలో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోని ఇతర పార్టీల నేతలను చేర్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. బీజేపీకి చెందిన ముఖ్య నాయకులను కూడా టీఆర్‌ఎస్‌లో చేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఓ నాయకుడు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరోసారి చేరికల సభ జరుగుతుందని మంత్రి ఐకేరెడ్డి స్పష్టం చేశారు. 

సభకు రానున్న ఉమ్మడి జిల్లా నేతలు
ఈనెల 5న ఉట్నూర్‌లో నిర్వహించే సభకు మొదట కేటీఆర్‌ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ, చివరికి హరీష్‌రావు రావడం ఖరారైంది. ఉమ్మడి జిల్లాలోని మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు గొడం నగేష్, బాల్క సుమన్, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వివేక్, రమేష్‌ రాథోడ్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, రాష్ట్ర డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, తదితరులందరు సభలో పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు