ఆ మూడే!

30 May, 2020 08:13 IST|Sakshi

బీపీ..షుగర్, నిమోనియా కామన్‌ పాయింట్‌

నగరంలో కరోనాతో ఇప్పటికే 57 మంది మృతి

మృతుల్లో సగానికిపైగా 50 ఏళ్లు పైబడిన వారే

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వృద్ధుల పాలిట శాపంగా మారుతోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటు మధుమేహం,హైపర్‌ టెన్షన్‌(బీపీ), నిమోనియా జబ్బులుఉన్నవారికి కోవిడ్‌ వైరస్‌ శాపంలా మారింది. యుక్త వయస్కులతో పోలిస్తే వృద్ధులు ఎక్కువగా వైరస్‌ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. వీరు చికిత్సలకు కోలుకోక పోగా..వైరస్‌ నిర్ధారణ అయిన రెండు మూడు రోజులకే మృత్యువాతపడుతుండటం ఇబ్బందిగా మారింది. గురువారం నాటికి తెలంగాణలో 67 మంది కరోనా వైరస్‌తో మృతి చెందగా..వీరిలో 57 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులే ఉన్నారు. 51 ఏళ్లు పైబడిన వారు 39 మంది ఉండగా, 41 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు 11 మంది ఉన్నారు. 50 శాతం మంది మృతుల్లో మధుమేహం, హైపర్‌టెన్షన్, నిమోనియా కామన్‌గా కన్పించాయి. మరికొంత మందిలో హైపర్‌టెన్షన్, మ ధుమేహంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటు, కేన్సర్‌లు కూడా కారణమని స్పష్టమైంది.

గడప దాటక పోయినా...
నగరంలో మార్చి 2న తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రభుత్వం 22న జనతా కర్ఫ్యూ ప్రకటించింది. ఆ తర్వాతి రోజు నుంచి వరుస లాక్‌డౌన్‌లను ప్రకటిస్తూ వచ్చింది. నిజానికి ఈ లాక్‌డౌన్‌ సమయంలో వీరంతా ఇంటి గడప కూడా దాటలేదు. కానీ వైరస్‌ బారిన పడి మృత్యువాతపడటం ఆందోళన కలిగించింది. కుటుంబ సభ్యులు నిత్యవసరాల పేరుతో మార్కెట్లలో తిరిగి వచ్చారు. టైం పాస్‌ కోసం ఇరుగు పొరుగు వారితో కలిసి అష్టా చెమ్మా వంటి ఆటలు కూడా ఆడారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం, నాలుగైదు కుటుంబాలు ఒకే చోటకు చేరడం, వివిధ రకాల వేడుకల పేరుతో విందులు ఏర్పాటు చేయడం, ఈ వేడుకల్లో పిల్లలూ పాల్గొనడం, ఇంటికి వచ్చిన తర్వాత తాత, నానమ్మ, అమ్మమ్మలతో ఆడుకుంటున్నారు. ఇలా పెద్దల నుంచి పిల్లలకు, వారి నుంచి వృద్ధులకు వైరస్‌ విస్తరిస్తుంది. కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న మరికొంత మందికి డయాలసిస్‌ కేంద్రాల ద్వారా వైరస్‌ విస్తరించింది. వారి మృత్యు వాతకు కారణమైంది. ఒక్కరి మరణంతో ఆ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కో మృతుని కుటుంబంలో 15 నుంచి 30 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం.   

400పైగా కుటుంబాలకు ఎఫెక్ట్‌
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2256 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికం 1410 కేసులు కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. అంతేకాదు కరోనా వైరస్‌తో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 కుటుంబాలు ఎఫెక్ట్‌ కాగా, వీటిలో 400పైగా కుటుంబాలు నగరంలోనే ఉన్నాయి. అంతేకాదు కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, పురానాహవేలి, పహడీషరీఫ్, చంచల్‌గూడ, వనస్థలిపురం, జియాగూడ, ఓల్డ్‌ మలక్‌పేట, మెహిదీపట్నం, మలక్‌పేట్‌గంజ్, అంబర్‌పేట్, ఖైరతాబాద్‌లలో వైరస్‌ కట్టడి కోసం కంటైన్మెంట్‌లను
పటిష్టంగా అమలు చేశారు. ఫలితంగా ప్రస్తుతం వైరస్‌ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. కానీ ఇటీవల ఇప్పటి వరకు కేసులు నమోదు కానీ కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో అవసరం లేక పోయిన రోడ్లపైకి రావడం, మార్కెట్లు, వైన్‌షాపుల ముందు భారీగా క్యూలు కట్టడం, భౌతిక దూరం పాటించక పో వడం, మాస్క్‌లు ధరించక పోవడం వల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. 

మరిన్ని వార్తలు