మళ్లీ కొత్త జిల్లాల లొల్లి!

11 Aug, 2017 00:45 IST|Sakshi
మళ్లీ కొత్త జిల్లాల లొల్లి!

వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రంపై తకరారు
కలెక్టరేట్‌ స్థలం ఎంపికపై వివాదం
పరకాల, నర్సంపేట, మామునూరుల్లో ఆందోళనలు
అధికార పార్టీ ఎమ్మెల్యేల తలోబాట.. తెరపైకి నర్సంపేట జిల్లా డిమాండ్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త జిల్లాల పేచీ మళ్లీ తెరపైకి వచ్చింది. పాత వరంగల్‌ జిల్లా కేంద్రంగా ఈ వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఉన్న నర్సంపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ అక్కడి నేతలు తాజాగా డిమాండ్‌ను లేవనెత్తారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని.. రెవెన్యూ డివిజన్లకు సైతం సంబంధం లేకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని పేర్కొంటూ ఆ ప్రాంత నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పాత వరంగల్‌ జిల్లా ఐదు జిల్లాలుగా ముక్కలైంది. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాలుగా విడగొ ట్టారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసే ఉన్నా.. ఈ పాత జిల్లా కేంద్రాన్ని వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలుగా విడగొట్టడంపై స్థానికుల నుంచి విమర్శలు పెల్లుబికాయి. హన్మకొండ పేరును పరిగణనలోకి తీసుకోకుండా.. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలుగా పేరు పెట్టడం కూడా వివాదాస్పదమైంది.

అసలు జిల్లా కేంద్రం ఎక్కడ?
హన్మకొండలో సుబేదారి ప్రాంతంలోని ఉమ్మడి జిల్లా కలెక్టరేట్‌ ప్రాంతాన్ని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంగా మార్చారు. దాంతో ఇబ్బందేమీ లేకున్నా.. కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రమేదీ? ఎక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం కొత్త వివాదాన్ని రాజేసినట్లయింది. హన్మకొండ లోని మిషన్‌ కాకతీయ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ను తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌ సముదాయాన్ని ఎక్కడ  నిర్మిస్తే  అనువుగా ఉంటుందనేది అధికారులకు,  ప్రజాప్రతినిధులకు పరీక్ష పెట్టినట్ల యింది. గీసుకొండ మండలం మొగిలిచర్లలో కలెక్టరేట్‌ ఏర్పాటుకు ఉచితంగా భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు.

ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు ఈ నెల 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ ప్రాంతంలో కలెక్టరేట్‌ ఏర్పాటును పరకాల, వర్ధన్నపేట ప్రజలు, నాయకులు  వ్యతిరేకిస్తు న్నారు. మొగిలిచర్లకు బదులుగా నర్సంపేట లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానిక నేతలందరూ  ఆందోళనలు చేపట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, టీడీపీ నేత రేవూరి అందులో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత నేతలు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు.  వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రాన్ని మామునూరులోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలంటూ వర్ధన్నపేట నియోజక వర్గంలో అఖిలపక్ష నేతలు దీక్షలు చేపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు  జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనపై తలోరకంగా స్పంది స్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు