మరింత ‘బెస్ట్‌’గా..

22 Jul, 2018 03:08 IST|Sakshi

‘ఎస్సీ’ బీఏఎస్‌ పథకానికి మరిన్ని హంగులు 

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత వసతితో బోధన అందించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (బీఏఎస్‌) పథకానికి మరిన్ని హంగులు అద్దుతోంది. పరిమిత స్థాయిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని భావిస్తోంది. ఏటా గరిష్టంగా 5 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలకు క్రేజ్‌ పెరగడం.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీట్లు ఇవ్వడం కష్టమవడంతో ఈ ప్రత్యామ్నాయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. బీఏఎస్‌ ద్వారా మరింత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఉపక్రమించింది. 

ఒకటో తరగతి నుంచే.. 
రాష్ట్రంలో 185 పాఠశాలలను బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లుగా ఎస్సీ అభివృద్ధి శాఖ గుర్తించింది. పదేళ్లలో వచ్చిన ఫలితాలు, పాఠశాలల నిర్వహణ, బోధన సిబ్బంది సామర్థ్యం ఆధారంగా ఈ పాఠశాలలను ఎంపిక చేస్తారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ పథకం కింద 8,390 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్‌ పద్ధతిలో విద్యను అభ్యసిస్తున్నారు. 2017–18లో 785 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. 91.97 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 27 మంది 9.5 కంటే ఎక్కువ జీపీఏ సాధించారు. బీఏఎస్‌ పథకం సత్ఫలితాలు ఇస్తుండటంతో మరింత విస్తృతం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఏటా 5 వేల మందికి అవకాశం ఇచ్చేలా స్కూళ్ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఐదో తరగతి నుంచే రెసిడెన్షియల్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. తాజాగా ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. 

విద్యార్థికి ఏటా రూ. 35 వేలు 
బీఏఎస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థికి ఏటా రూ. 35 వేలు సర్కారు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని భావిస్తుండటంతో ఫీజుల పైనా పరిశీలన చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీ పాఠశాలల వివరాల సేకరణతో పాటు అక్కడి ఫీజులను అంచనా వేస్తోంది. జిల్లాలో విద్యార్థి చెల్లిస్తున్న సగటు ఫీజులు అంచనా వేసి నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ఫీజు ఖరారు చేయనుంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా