పట్టణాభివృద్ధికి మరిన్ని నిధులు

14 Mar, 2018 01:55 IST|Sakshi
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్‌

టీయూఎఫ్‌ఐడీసీ నుంచి నిధులు: కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా మరిన్ని నిధులు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పట్టణాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. 39 శాతం రాష్ట్ర జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉందని, త్వరలో కొత్త పురపాలికల ఏర్పాటుతో ఇది 45 శాతానికి పెరగనుందన్నారు. పట్టణాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పట్టణాల్లోని మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలను ప్రణాళికాబద్ధంగా పక్కా రోడ్డు మ్యాపుతో అభివృద్ధి చేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పట్టణాలకు టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా ఇస్తున్న నిధులు నిర్ణీత గడువులోగా వినియోగించుకునే విధంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లోని జంక్షన్‌ టు జంక్షన్‌ రోడ్ల అభివృద్ధి, మోడల్‌ మార్కెట్లు, శ్మశాన వాటికలు, పార్కుల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీటిని పూర్తి చేస్తే పట్టణాల్లో గుణాత్మక మార్పు వస్తుందన్నారు.  

ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోండి.. 
జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తే పట్టణాల అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నా రు. ప్రస్తుతం ఇస్తున్న టీయూఎఫ్‌ఐడీసీ నిధు లు పురపాలికలకు మార్గాల్లో వచ్చే నిధులకు అదనంగా వచ్చే నిధులని మంత్రి తెలిపారు. వీటితో చేపట్టే పనులను పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ శాఖ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఈ పనుల వివరాలను నెలాఖరులోగా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలన్నారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు.

మరిన్ని వార్తలు