కోడితో రాబడి

24 Sep, 2014 23:45 IST|Sakshi
కోడితో రాబడి

 నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గతంలో గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశాను. మూడేళ్ల క్రితం కోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఆలోచన తట్టింది. నాకున్న వ్యవసాయ పొలంలోనే చిన్నపాటి షెడ్డు నిర్మించి కోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాను. మొదట వెయ్యి కోళ్లతో ప్రారంభించా. ఆ తర్వాత రూ. ల క్ష బ్యాంకు రుణంతో మరో షెడ్డు నిర్మించుకున్నాను.

 బ్యాంకు రుణం సక్రమంగా చెల్లిస్తూ క్రమక్రమంగా 13వేల కోళ్ల సామర్థ్యం గల షెడ్లను ఏర్పాటు చేసుకున్నా. ప్రస్తుతం కూలీలపై ఆధారపడకుండా కుటుం బ సభ్యుల సహకారంతో కోళ్లను పెంచుతూ మంచి లాభం పొందుతున్నా. రెండెకరాల పొలంలో షెడ్లు నిర్మించుకుని ఏడాదికి రూ.5లక్షలకు పైగానే ఆదాయం ఆర్జిస్తున్నా.  

 కేవలం ఎనిమిది రోజులు శ్రద్ధ పెట్టాలి
 కేవలం ఎనిమిది రోజులు కోడిపిల్లలపై శ్రద్ధ పెడితే చాలు. చలికి తట్టుకునే విధంగా షెడ్ల ఉష్ణోగ్రతను పెంచడానికి హైఓల్టేజీ విద్యుత్ బల్బులు వేయడం, కరెంట్ లేని సమయంలో ఇనుప డబ్బాలకు రంధ్రాలు చేసి బొగ్గుల కుంపట్లు పెట్టి కోడి పిల్లలకు సరిపడా ఉష్ణోగ్రత ఉండేవిధంగా చూసుకోవాలి. ఆ పది రోజుల పాటు పిల్లలను గుంపులు కట్టి పడుకోకుండా అప్పుడప్పుడూ కదిలిస్తే సరిపడా దాణా తిని ఎదుగుదల ఉంటుంది.

ప్రతి రోజు ఉదయం ఫీడర్ల నిండా దాణా పోసి మధ్యాహ్నం కొంతసేపు మేత ఆపాలి. గంటకోసారి షెడ్డులో తిరిగి చూసుకోవాలి. 5-12 రోజుల సమయంలో కళ్లలో మందులు వేయాలి. అప్పుడప్పుడూ వ్యాధులను బట్టి మిగతా మందులను తాగునీటిలో కలిపి అందించాలి.

 ఇంటిల్లిపాదీ కష్టపడతాం
 నాతో పాటు మా తమ్ముడు శ్రీను, కుటుంబ సభ్యులందరం కష్టపడి పనిచేస్తాం. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంపై ఆధారపడితే పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రస్తుతం ఉన్నంతలో వ్యవసాయ పనులు చేసుకుంటూనే మూడేళ్లుగా పౌల్ట్రీఫాంను నడిపిస్తున్నాం. కోడి ధరను బట్టి ప్రతి బ్యాచ్‌కు రూ.50వేలకుపైగా ఆదాయం వస్తుంది.

మరిన్ని వార్తలు