కదలని ఆరోగ్య శాఖ

16 Sep, 2014 03:20 IST|Sakshi
కదలని ఆరోగ్య శాఖ

 డేంజరస్‌గా ‘డెంగీ’
- ఇప్పటికే ముగ్గురు మృతి
- 35కు పైగా కేసులు నమోదు
- ఊరూరా పారిశుధ్య లోపం
- వాతావరణ మార్పులే కారణం
 నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. అధికారికంగా 22 కేసులను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వ్యాధి బారినపడి ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పులు, పారిశుధ్య లోపమే డెంగీ వ్యాధి ప్ర బలడానికి ప్రధాన కారణంగా వైద్యశాఖ అధికారులు తేల్చారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాధులను అదుపుచేయడంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
 
35 కేసులు నమోదు...
ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇద్దరు మృతి చెందడంతో పాటు 14 డెంగీ కేసులు వెలుగులోకి వచ్చాయి. బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో గతనెల 12న నీరడి శ్రీజ డెంగీతో మృతిచెందింది. వర్ని మండలం రుద్రూరు గ్రామంలో మొహినొద్దీన్‌పటేల్ (65) అనే వ్యక్తి డెంగీతో మృతిచెందాడు. లింగంపేట మండలం జగదంబ తం డాలో మరో వ్యక్తి డెంగీతో మృతిచెందాడు. డిచ్‌పల్లి మండలం చంద్రాయన్‌పల్లిలో ఏడుగురికి డెంగీ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో గోదావరి అనే మహిళ , జుక్కల్ మండలం కండేబల్లూరులో ఎనిమిది మందికి డెంగీ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో సంధ్య, అర్షిత్ అనే పిల్లలు వ్యాధి బారినపడ్డారు. కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది.  
 
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ...
వ్యాధులను నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ  పూర్తిగా విఫలమవుతోంది. కాలానికి అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు అదనపు బాధ్యతలు అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ, ఈ ఏడాది వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉన్నా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పర్యటనలు నామమాత్రంగానే ఉన్నాయి. సగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పర్యటించకపోవడం గమనార్హం. ప్రతి నెల క్లస్టర్ వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా ఎలా ంటి ప్రయోజనం లేకుండా పోయింది. నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి నివేదికలను చేరవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉన్నా కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారిస్తే  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.
 
అస్తవ్యస్తంగా పారిశుధ్యం
గ్రామాలలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇదే వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమని వైద్యశాఖ అధికారులు గుర్తించారు. గ్రామాలలో అపరిశుభ్రత నిర్మూలనకు ప్రతి మూడు నెలలకోసారి శానిటేషన్ నిధులను మంజూరు చేస్తున్నారు. ఇవి క్షేత్రస్థాయిలో ఖర్చుచేయడం లేదు. కొన్ని పీహెచ్‌సీలలో నిధులు ఖర్చు చేయ లేక తిరిగి పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు శానిటేషన్ పేరున నిధులను దుర్వినియోగం కూడా కొనసాగుతోంది. శానిటేషన్ నిధులతో మురికి కాల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపట్టాలి. కానీ, ఇవి సక్రమంగా అమలు కాకపోవడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి.
 
దోమల ప్రభావం పెరిగింది
జిల్లాలో దోమల ప్రభావం పెరిగింది. అందుకే డెంగీ విజృంభిస్తోంది. ప్రస్తుతం 20 వరకు కేసులు నమోదయ్యాయి. వ్యాధి నిర్మూలనకు తీవ్రంగా కృషిచేస్తున్నాం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. వ్యాధి ప్రబలిన చోట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం.
 - లక్ష్మయ్య, జిల్లా మలేరియా నిర్మూలన అధికారి

మరిన్ని వార్తలు