ఎట్టకేలకు ‘పుర’ ఫైళ్ల కదలిక

4 Nov, 2015 02:47 IST|Sakshi
ఎట్టకేలకు ‘పుర’ ఫైళ్ల కదలిక

50కి పైగా ఆమోదించిన సీఎం  
జీహెచ్‌ఎంసీ సీఈ వీఆర్‌ఎస్     తిరస్కృతి     

 
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పెండింగ్ ఫైళ్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం 50కి పైగా పెండింగ్ ఫైళ్లపై నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో సీఎంఓ నుంచి పురపాలక శాఖకు ఒకటీ రెండు ఫైళ్లు తిరిగి రావడం అరుదైన విషయంగా మారగా... ఒకేసారి 50 ఫైళ్లపై సీఎం సంతకాలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిశ్రమల స్థాపన కోసం భూ వినియోగ మార్పిడి అనుమతులు కోరుతూ టీఎస్-ఐపాస్‌కు వచ్చిన దరఖాస్తులతో పాటు పురపాలక శాఖలోని కొందరు అధికారుల పదోన్నతులు, బదిలీలు, వైద్య బిల్లుల చెల్లింపులు, కారుణ్య నియామకాలకు సంబంధించిన పదుల సంఖ్యలో ఫైళ్లు సీఎం ఆమోదం పొంది పురపాలక శాఖకు తిరిగి చేరుకున్నాయి.

 నిజామాబాద్‌కు మునిసిపల్ కమిషనర్..
 ఆర్నెల్ల కిందటి ఓ ప్రతిపాదనకు మోక్షం లభించడంతో మంగళవారం నిజామాబాద్‌మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్, అదనపు కమిషనర్‌గా విశ్వనాథంకు పోస్టింగ్ కేటాయిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలుగా నాగేశ్వర్ పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నారు. ఆరేళ్ల కింద తల్లిదండ్రులిద్దరూ చనిపోగా అనాథగా మారిన యువతి ప్రియాంక కారుణ్య నియామకం కింద జల మండలిలో తండ్రి ఉద్యోగాన్ని త్వరలో పొందనున్నారు. దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత ఈ ఫైల్‌కు మోక్షం లభించింది. కొందరు ఉద్యోగుల వైద్య బిల్లుకు సంబంధించిన ైఫైళ్లు సైతం ఏడాది తర్వాతే ఆమోదం పొందాయి. ఇదిలా వుండగా, జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇంతియాజ్ అహమ్మద్ స్వచ్ఛంద పదవి విరమణ కోసం నెల రోజుల కింద పెట్టుకున్న దరఖాస్తును సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలని ఇంతియాజ్‌కు సూచించినట్లు సమాచారం.  

 కొండలా పేరుకుని..
 సీఎం సొంత శాఖల్లో పురపాలక, పట్టణాభివృద్ధి ఒకటి. సీఎం సంతకం కోసం పురపాలక శాఖ నుంచి వెళ్తున్న ఫైళ్లు సీఎంఓలోనే పేరుకుపోతుండడంతో పెండింగ్ ఫైళ్ల సంఖ్య వేలల్లో వుంది. వివిధ శాఖలకు సంబంధించి 6,500కు పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, అందులో సగం పురపాలక శాఖకు సంబంధించినవేనని సమాచారం. సీఎంఓలో పురపాలక శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పెండింగ్ ఫైళ్ల విషయంలో చొరవ తీసుకోవడం లేదని విమర్శలున్నాయి.
 
 

మరిన్ని వార్తలు