ఒకటికే.. ఇంకో పక్షం!

11 Oct, 2014 04:00 IST|Sakshi
ఒకటికే.. ఇంకో పక్షం!

కొల్లాపూర్
 మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీఎల్‌ఐ) ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ వద్ద గత నెలలో నీట మునిగిన మోటార్ల మరమ్మతు పనులు ఇంకా పక్షం రోజులు పట్టే అవకాశం ఉంది. పనులు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ ఇంకా సమయం పట్టేలా ఉంది. కనీసం ఒక మోటార్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి నీటిని పంపింగ్ చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా పనులు ముమ్మరమయ్యాయి. అయితే ప్రభుత్వం, అధికారులు ఆశించిన ఫలితం సాధించేందుకు ఇంకా పక్షం రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎలాగైనా ఈ నెల మొదటి వారంలోనే పనులు పూర్తి చేసి ఒక పంపునకు ట్రయల్న్ ్రనిర్వహించాలని అధికారులు భావించినా.. అవి ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు.

 కొనసాగుతున్న పనులు
 లిఫ్ట్‌లోని ఒకటో పంపునకు బీహెచ్‌ఈఎల్ కంపెనీ ప్రతినిధులు నిపుణులైన ఇంజనీర్లచే పనులు చేయిస్తున్నారు. మోటార్లలోకి వెళ్లిన నీటిని ఇప్పటికే తొలగించారు. నీటి ఆవిరిని, తేమను పూర్తిస్థాయిలో తొలగించేందుకు మిషనరీతో హీట్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను పంపుహౌస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పనులు కొన్నిరోజులుగా కొనసాగుతున్నాయి. అయితే ఒకటో మోటార్‌లో నీటి ఆవిరిని, తేమను పూర్తిస్థాయిలో తొలగించే ప్రక్రియ ఇంకా పూర్తి కావడం లేదు. మిషనరీ వాల్యూస్ వచ్చాక హీట్ చేసే ప్రక్రియను ఆపివేసి మిగతా పనులు చేపట్టాలనే యోచనలో బీహెచ్‌ఈఎల్ కంపెనీ సిబ్బంది ఉన్నారు.

పనులను పటేల్ కంపెనీ ప్రతినిధులతోపాటు ప్రాజెక్టు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకటో మోటార్‌కు త్వరితగతిన ట్రయల్న్ ్రనిర్వహించాలని అధికారులు, కంపెనీల నిర్వాహకులు భావిస్తున్నా అవి ఆచరణ సాధ్యం కావడం లేదు. మరమ్మతు పనులు పూర్తయ్యేసరికి మరో పది లేదా 15రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించారు. మరమ్మతు పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

 రబీ పంటకు నీరందేనా?
 ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులు రబీ పంట సాగు చేసుకోవచ్చని రెండు, మూడు రోజుల్లో లిఫ్టులోని మొదటి పంపు మరమ్మతు పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మూడురోజుల క్రితం ప్రకటించారు. ఎంజీఎల్‌ఐ కాలువల కింది పంటలకు సాగునీరందుతుందని ఆయన హామీ ఇచ్చారు. అధికారులు కూడా ఈ దిశగా పనులు సాగిస్తున్నా మరమ్మతుల్లో మాత్రం జాప్యం జరుగుతుంది.

రబీ సాగుకు మరో పక్షం రోజుల్లోనైనా కచ్చితంగా మోటార్‌ను విజయవంతంగా రన్ చేసి నీటి పంపింగ్  చేస్తే ఎటువంటి ఢోకా ఉండదు. కానీ మరమ్మతుల్లో మరికొంత జాప్యం జరిగితే పంటల సాగుకు ఇబ్బందులు తలెత్తడం ఖాయం. రైతాంగ సమస్యను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎల్లూరు లిఫ్ట్‌లోని మొదటి పంపునకు త్వరితగతిన మరమ్మతులు పూర్తిచేయాలని రైతాంగం కోరుతున్నారు.

మరిన్ని వార్తలు