మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి

9 Dec, 2018 02:10 IST|Sakshi
శనివారం అపోలో క్రెడిల్‌ జాతీయ సదస్సు –2018ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న అపోలో గ్రూపు సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి. చిత్రంలో మహితా రెడ్డి, శోభనా కామినేని, హిమబిందు సింగ్, సంగీతా రెడ్డి

అపోలో క్రెడిల్‌ జాతీయ సదస్సులో డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నమోదవుతున్న మాతా శిశు మరణాలపై అపోలో క్రెడిల్స్‌ జాతీయ సదస్సు–2018 ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ..ఇప్పటికీ మాతా శిశు మరణాలు వెలుగు చూస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ మరణాల రేటును మరింత తగ్గించాల్సిన ఆవశ్యకత నేటితరం వైద్యులపై ఉందని పేర్కొంది. అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగే ఈ సదస్సును అపోలో గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌.సి.రెడ్డి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాతా శిశు సంరక్షణ కోసం మరింత కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశంలో మెటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌ (ఎంఎంఆర్‌) పెద్ద సమస్యగా ఉందన్నారు. 2005–06లో ప్రతీ వెయ్యిమంది తల్లుల్లో 335 మంది ప్రసవ సమయంలో మరణించారని, ఈ మరణాల రేటు 2014–15 నాటికి 135కు తగ్గిందని ఆయన వెల్లడించారు. ఆస్పత్రి ప్రసవాల సంఖ్య పెరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గతంలో 26%గా ఉన్న ఆస్పత్రి ప్రసవాలు ప్రస్తుతం 81 శాతానికి పెరిగినా మరణాల రేటు ఇంకా కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.  

మరణాల రేటు 70కు తగ్గించాలి 
2030 నాటికి ప్రసవ సమయంలో తల్లుల మరణాల సంఖ్యను 70కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రతాప్‌.సి.రెడ్డి తెలిపారు. ప్రపంచ సగటు ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ రేటు (ఐఎంఆర్‌)12 ఉండగా, దేశంలో 2017 నాటికి పుట్టిన ప్రతీ వెయ్యి మంది శిశువులకు 32 శిశువులు చనిపోతున్నారని తెలిపారు. ఇందులో నెలలోపు శిశువుల్లో 24 మంది మృతి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి 70% మాతా శిశు మరణాలకు దీర్ఘకాలిక రోగాలు కారణమవుతాయని, రాబోయే రోజుల్లో వీటి నుంచి భారీ ప్రమాదాన్ని పొంచి ఉందని హెచ్చరించారు.

ఈ సదస్సుకు అపోలో గ్రూప్‌ వైస్‌చైర్‌ పర్సన్‌ శోభన కామినేని, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, మెడికల్‌ డైరెక్టర్‌ అనుపమ్‌ సిబల్, ఓబీఎస్‌హెచ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ మహితారెడ్డి, పీఏటీఎస్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ హిమబిందు, ఎన్‌ఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బల్‌దేవ్‌ భాటియా, డాక్టర్‌ సియంగ్‌ లిన్‌టాన్, డాక్టర్‌ వైఎస్‌ యంగ్, డాక్టర్‌ శైలేశ్‌ కుమార్, సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది గైనకాలజీ, పీడియాట్రిక్‌ వైద్యనిపుణులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు