మశక.. మశక.. చీకటిలో..

11 Mar, 2018 02:16 IST|Sakshi

రాష్ట్ర రాజధానిలో నరకం చూపిస్తున్న దోమలు

రాత్రి వేళల్లో వీర విజృంభణ

మార్చిలో విచ్చలవిడిగా పెరిగిన దోమలు

దోమల నివారణకు ఏటా రూ. 700 కోట్లు ఖర్చు

అనుకూల వాతావరణంలో పెరిగిపోయిన దోమలు

పెరుగుతున్న మలేరియా, డెంగీ కేసులు  

మశకమన్నాక కుట్టక తప్పదు.. కుట్టాక దద్దుర్లూ రాకా తప్పదు.. అనివార్యమగు ఈ విషయము గురించి శోకింప తగదు.. 
జనన మరణాల గురించి భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని ప్రస్తుతమున్న పరిస్థితులకు తగ్గట్లు మార్చేసుకుని.. నగరవాసులు ఇలా సర్దుకుపోతున్నారు.. దోమ(మశకం).. బతికేది కేవలం 20 నుంచి 30 రోజులే.. అయితే, చప్పట్లు కొడితే చచ్చిపోయే ఈ చిన్నప్రాణి ఇప్పుడు నగరవాసులతో కబడ్డీ ఆడేస్తోంది.. పిసినారి చేత కూడా డబ్బులు ఖర్చు పెట్టిస్తోంది.. దోమల నియంత్రణ కోసం నగరవాసులు ఏడాదికి ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసా? దాదాపుగా రూ.700 కోట్లు! అయితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రతి కుటుంబం దోమల నివారణకు నెలకు రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని ఆరోగ్య శాఖతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.  

ఎండాకాలం మరింత వ్యథే.. 
మళ్లీ దోమల టార్చర్‌ మొదలైంది. చలికాలంలో కొంత ఊపిరిపీల్చుకున్న ప్రజలకు.. వేసవి ప్రారంభంలోనే దోమల బాధ పట్టుకుంది. రాత్రిళ్లు అయితే.. వీర విజృంభణే.. గుంపులుగా వచ్చేస్తున్నాయి.. అలాగనీ పగటి పూట కనికరం చూపడం లేదు. గతంలో సీజనల్‌గా మాత్రమే కనిపించే దోమలు.. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గడిచిన నెలన్నర మొత్తం దోమలకు అనువుగా మారింది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న దోమలు.. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎనాఫిలిస్, క్యూలెక్స్‌ వంటి దోమలు పగటి పూట ఇళ్లల్లోనే మకాం వేసి రాత్రులు స్వైరవిహారం చేస్తుండడంతో జనాలు మలేరియా, డెంగీ బారిన పడుతున్నారు. 

అన్ని మార్గాల్లోనూ.. 
దోమలను శాశ్వతంగా వదిలించుకోవడం అంత సులభం కాకపోవడంతో తాత్కలిక ఉపశమనానికి పెట్టే ఖర్చు తెలియకుండానే కోట్లకు చేరిపోతోంది. అటు దోమలు సైతం ప్రజలు చేస్తున్న నివారణ చర్యలను ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ చేసే ఫాగింగ్‌ ఓ పథకం ప్రకారం లేకపోవడంతో వాటి విజృంభణ మరింత పెరిగింది. ఇందుకు ప్రజలు కాయిల్స్‌ ప్రయోగించడం, అవి పనిచేయకపోవడంతో లిక్విడ్, మస్కిటో బ్యాట్స్‌ వాడకం పెంచారు. ఇలా రాజధానిలోని ఒక్కో కుటుంబం దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ప్రతి నెలా రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. అంటే ప్రతి కుటుంబం ఏటా కనీసం రూ.2 వేల నుంచి రూ.2,500 ఖర్చు చేస్తున్నాయని ఆరోగ్య సంస్థలు స్పష్టం చేశాయి. ఇలా రాజధానిలో నివసించే 35 లక్షల కుటుంబాలు దోమల నివారణకు ఏటా రూ.700 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనంలో తేలింది. 

20 నుంచి 30 రోజులు..
దోమల జీవితకాలం చాలా తక్కువే. ఓ దోమ 20 రోజుల నుంచి నెల రోజుల వరకే బతుకుతుంది. కానీ ఒకే సమయంలో వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. వాటి నుంచి పిల్ల దోమలు బయటకు రావడానికి 7 రోజులు పడుతుంది. ఆ లోపు యాంటీ లార్వా ఆపరేషన్‌ చేస్తేనే.. దోమల ఉత్పత్తిని నివారించగలం. కానీ సరైన సమయానికి మందులు చల్లకపోవడం వల్ల దోమలు వీరవిహారం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న దోమల నియంత్రణ చర్యలు పెద్దగా ఫలితం చూపించడం లేదు. యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్‌ వంటివి విఫలం అవుతున్నాయి.

అక్కడా..ఇక్కడా అని లేదు.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని శివారు ప్రాంతాల నుంచి సెంటర్‌ సిటీ వరకు అన్నీ చోట్లా దోమలు విజృంభిస్తున్నాయి. మెహిదీపట్నం, ఆసీఫ్‌నగర్, షాలిబండ, మారేడ్‌పల్లి, న్యూబోయిన్‌పల్లి, అల్వాల్, కీసర, కొండాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. దోమ పోటుతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. గత ఏడాది 296 మలేరియా కేసులు నమోదుకాగా, డెంగ్యూ కేసులు 117 నమోదయినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటిస్తేనే దోమల నివారణ సాధ్యమవుతుందని జీహెచ్‌ంఎసీ అధికారులు చెప్తున్నారు. నల్లా గుంతలు, నీటి సంపులు ఇంటి పరిసరాల్లోని టైర్లు, పూల కుండీలు, పాత బకెట్లలో ఉండే నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, నీరు నిలవకుండా చర్యలు చేపడితే దోమల నివారణ సగం పూర్తయినట్లే అని వైద్యులు సూచిస్తున్నారు.

దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ నెల ఖర్చు రూ.100-300
దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ ఏడాది ఖర్చు రూ.2000-2500
దోమల నివారణకు రాజధానిలో  ఏడాదికయ్యే ఖర్చు రూ.700 కోట్లు

– సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు