అత్యాధునికం

29 Apr, 2019 08:02 IST|Sakshi
దంత పరీక్షలు చేస్తున్న వైద్యులు

పాలమూరు: వలసల జిల్లాలో కార్మికులు, రైతులు, దినసరి కూలీల జనాభానే అధికంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామికులకు కాలం కలిసి రాక ఏదైనా జబ్బు చేసినా.. ధీర్ఘకాలిక రోగాలొచ్చినా వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్, కర్నూలు వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. వైద్య చికిత్సలకు చెల్లించే బిల్లులతోపాటు వచ్చిపోయే రవాణా చార్జీలతో ఆర్థికంగా చితికిపోయేవారు. ఏడాది కాలంగా ఈ సమస్యలన్నీ తీరిపోయాయి. వైద్యరంగంలో చోటుచేసుకున్న మార్పులతో పాలమూరులోని జనరల్‌ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు రావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

పెరిగిన రద్దీ 
కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలోనే పేదలకు వైద్యం అందించాలని అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. ఇటీవల జిల్లా ఆస్పత్రి నుంచి జనరల్‌ ఆస్పత్రిగా మార్పు చెందిన అనంతరం అధునాతన వసతులు కల్పించే దిశగా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. ప్రస్తుతం 450 పడకల ఆస్పత్రిగా సేవలందిస్తుండగా మరో 200 పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు నివేదిక పంపారు. నాలుగు జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వసతుల కల్పనపై పక్కా ప్రణాళికతో చర్యలు అందించి రోగులకు సర్కారీ వైద్యంపై నమ్మకం కలిగించే దిశగా ప్రయత్నాలుసాగుతున్నాయి. ప్రతి రోజు ఆస్పత్రికి ఇన్‌పేషంట్లు 450 నుంచి 500మంది ఉంగా అవుట్‌ పేషంట్లు 1400 నుంచి 1600 మంది వరకు ఉంటున్నారు.
 
స్థానికంగానే కార్పొరేట్‌ వైద్యం 

సర్కారు వైద్యాన్ని మెరుగుపరిచే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. గతంలో సమస్యలకు నిలయాలుగా ఉండే సర్కారు దవాఖానాలో ఆధునిక సౌకర్యాలు అమలు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు పచ్చకామెర్లు ఉండటం సహజం.. వీటి చికిత్సకు నూతంగా ఫొటోథెరపి మిషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు.

డెంగీ రోగుల్లో తెల్లరక్త కణాలు తగ్గిపోతుండటంతో ప్రాణాపాయం సంభవిస్తోంది. దీనికి చికిత్స అందించడానికి ఫ్లేట్‌లెట్స్‌ మిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కిడ్నీ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారికి 7 అత్యాధునిక  టెక్నాలజీతో కూడిన మిషన్లతో కూడిన పడకలు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో గాయపడి కాళ్లుచేతులు, ఎముకలు విరిగిపోయినా వారికి ఆపరేషన్లు అందించడానికి ఆర్థోపెడిక్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. గర్భిణులను పరీక్షించి, కడుపులో బిడ్డ బాగోగులను గమనించడానికి అల్ట్రా స్కానింగ్‌ మిషన్లు, అత్యాధుని సదుపాయాలతో లెబర్‌ రూంను తీర్చిదిద్దారు.
 
అదనపు పడకలకు చర్యలు  
ప్రస్తుతం ఉన్న జనరల్‌ ఆస్పత్రిలో 450పడకలు అందుబాటులో ఉన్నాయి. రాబోయో జూన్‌ నాటికి వీటి సంఖ్య పెంచడానికి అవసరం అయిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 200 పడకలు పెంపు చేసి మొత్తం 650 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి కసరత్తు జరుగుతోంది. తల్లీపిల్లలకు ఉపయోగకరంగా ఉండేవిధంగా మెటర్నటీ వార్డు, లేబర్‌రూం, ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ, ట్రామా కెర్‌ సెంటర్‌ విభాగాలకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. దీనికోసం ట్రామా కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.60లక్షలు మంజూరయ్యాయి. అయితే దీనికి కావాల్సిన సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు రావాల్సి ఉంది. ప్రధానంగా పోస్టుమార్టం గది చాలా చిన్నగా ఉండటం వల్ల ఇబ్బంది ఉండేది దీనిని దృష్టిలో పెట్టుకుని మరో మూడు గదులను రూ.10లక్షలతో నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా ఇటీవలే ప్రారంభించారు.

ఖరీదైన మిషన్లు అందుబాటులో.. 
ఇటీవల జిల్లా జనరల్‌ ఆస్పత్రికి వచ్చిన ఖరీదైన మిషన్లు వచ్చాయి. వాటిలో రూ.1కోటీ 8లక్షలతో డైరెక్ట్‌ రేడియోగ్రఫి మిషన్‌ (డిజిటల్‌ ఎక్స్‌రే), రూ.50లక్షలతో హిమోగ్లోబిన్‌ అనాలసిస్‌ మిషన్, రూ.10 లక్షలతో రేర్‌ స్పైన్‌ సర్జరీ ఇన్‌ ఆర్థోపెడిక్‌ విభాగం, రూ.42 లక్షలతో సింగల్‌ డోనర్‌ ప్లేట్‌లేట్స్‌ మిషన్‌ డెంగ్యూ జ్వరం కోసం, రూ.58లక్షలతో బ్లడ్‌బ్యాంకు మిషన్, రూ.40లక్షలతో లివర్‌ ఫంక్షన్‌ పరీక్షల మిషన్‌ బిగించారు.

దీంతో పాటు దంత విభాగంలో డిజిటల్‌ ఎక్స్‌రేతో పాటు రూట్‌ కెనాల్‌ మిషన్లు పెట్టారు. అదేవిధంగా పేదలకు ఎంతో ఉపయోగపడే సీటి స్కానింగ్‌ సెంటర్‌ను రూ.రూ.1కోటీ 6లక్షలతో నిర్మాణం చేశారు. మొత్తం 16 స్లైడ్స్‌తో కూడిన ఈ మిషన్‌ ఇన్‌స్టాల్‌ చేశారు.  బ్రెయిన్‌తో పాటు శరీరంలో ఉండే అన్ని రకాల అవయవాలకు దీని ద్వారా పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. రూజ 15 లక్షల నిధులతో లెబర్‌ రూం పడకల సామర్థ్యం పెంచి అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. పాలియేటివ్‌ కేర్, తలసేమియా, హిమోఫిలియా బాధితుల కోసం ప్రత్యేక వైద్య సేవలు ఉన్నాయి.

నూతన టెక్నాలజీతో వైద్యం 
ప్రస్తుతం జనరల్‌ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు కొత్త మిషన్లు అత్యంత టెక్నాలజీతో కూడినవి. రక్తశుద్ధి చేయించుకున్న రోగులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా ఉండేందుకు నూతనంగా సింగిల్‌ యూజ్డ్‌ (ఒకరికి ఉపయోగించిన పరికరం మరొకరికి ఉపయోగించరు) ఈ విధానంతో కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మిషన్‌లలో ఇలాంటి వన్‌టైమ్‌ ఫిల్టర్‌ విధానం వాడటం వల్ల రోగులకు కొత్తగా ఎలాంటి వ్యాధులు సోకవు. ప్రస్తుతం ఇలాంటి విధానం కేవలం హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తప్ప స్థానికంగా ఎక్కడా లేదు. 

ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం 
కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా జనరల్‌ ఆస్పత్రిలో అత్యాధుని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పటికే ఆస్పత్రికి అవుట్‌ పేషన్ల సంఖ్య పెరిగింది. ఎంఆర్‌ఐ కోసం రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల బడ్జెట్‌తో ప్రతిపాదనలు పంపించాం. ఈ మిషన్‌ కూడా అతి త్వరలో రానుంది.   – డాక్టర్‌ రామకిషన్,జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు